తాడితోట (రాజమహేంద్రవరం) : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ధనదాహానికి పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం జగన్‌ను ఆశీర్వాదించారన్నారు. ఎన్నికల తరువాత పరిణామాలను పరిశీలిస్తే చంద్రబాబు సహనం కోల్పోతున్నారన్నారు.
ఈవీఎంలలో తప్పులు దొర్లాయని, ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడ్డాయని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంకా సీఎం తానేనని, సీఎం పదవీ కాలం ఇంకా జూన్ వరకూ ఉందని అనడం ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. 2005లోనే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకువచ్చారని ఆయన గుర్తుచేశారు. రూ 4,500 కోట్లు ఖర్చు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
వైఎస్ ఉండి ఉంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పోలవరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పటికే అనుభవించే వారని బొత్స అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రస్తుతం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. రాష్ట్రానికి కావల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టుపై సర్వహక్కులు ఇవ్వాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని విమర్శించారు. శాసనసభా సాక్షిగా 2019లో గ్రావెటీతో నీళ్లిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తారన్నారు.
ఈ నెల 23 తరువాత ఎప్పుడైనా సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు,Ðð వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టిన బాబు
Published Wed, May 8 2019 4:42 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment