తారుమారు!
తారుమారు!
Published Fri, Mar 14 2014 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
నేతల ఇళ్లకు వెళుతున్న బొత్స
తొలుత చిన్న శ్రీను ఇంట్లో నేతలతో సమావేశం
ఆ తర్వాత కోలగట్ల ఇంట్లో ప్రత్యేక భేటీ
పార్టీ పరిస్థితిపై సుదీర్ఘ చర్చ
ఆయన ఇప్పటివరకూ జిల్లాలో మకుటం లేని మారాజు...ఆయన చెప్పిందే వేదంగా భావించే అనుచరులు ఎంతటి కార్యానికైనా సాహసించేవారు. ఎవరైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే... అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు ఆయనే అందరినీ కలిసే పనిలోపడ్డారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ పదవి పోయిన తర్వాత తొలిసారిగా జిల్లాకొచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. పార్టీని ఎలా నిలబెట్టాలన్న దానిపై దృష్టిసారించారు. సాధ్యాసాధ్యాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. ఏం చేస్తే గాడిలో పడుతుందన్న దానిపై నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో తానే నాయకుల ఇళ్లకెళ్లి సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టెక్కె విషయమై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. తొలుత తన మేనల్లుడు చిన్న శ్రీను ఇంట్లో సమావేశమయ్యారు.
రానున్న ఎన్నికల్లో ఎవరెక్కడ పోటీ చేయాలి? పరిస్థితులు ఎక్క డ అనుకూలంగా ఉన్నాయి, పార్టీ నుంచి వలసపోతున్నదెవరు? మిగిలేవారెంతమంది? తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన ట్టు తెలిసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికెళ్లారు. కొన్ని గంటల పాటు పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న వారి విషయమై సంప్రదింపులు చేశారు. లోపాయికారీ దెబ్బలు మొదలయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక నేతలిద్దరూ సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి ఇంతకాలం తన ఇంటికొచ్చిన నేతలతో పార్టీ రాజకీయాలపై చర్చించే బొత్స ఇప్పుడేకంగా నాయకుల ఇళ్లకెళ్లి సమావేశమవ్వడంతో పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపోతున్నాయి.
Advertisement