గుత్తి : అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గుత్తి మునిసిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీకి అవకాశం ఉన్నా.. తెలుగుదేశం పార్టీ ఒక స్వతంత్ర అభ్యర్థిని బలవంతంగా తమవైపు తిప్పుకోవడంతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు ద్వారా ఒక్క ఓటు మెజార్టీతో విజయం పొందింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల అధికారి (పీఓ) వెంకటస్వామి, కమిషనర్ ఇబ్రహీం కౌన్సిల్‌హాలులో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
సరిగ్గా పదిన్నర గంటలకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే జింతేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొట్రికె శ్రీహరిగుప్తా, మాజీ ఎంపీపీ కోనా మురళీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు వెంకటశివుడు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ర్ట నాయకుడు దిల్కా శీనా టీడీపీ కౌన్సిలర్లు ఎనిమిదిమందితోపాటు ఇండిపెండెంట్లు సరస్వతి, సురేష్‌బాబులను తోలుకొని కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
మునిసిపల్ సిబ్బందిని కమిషనర్ చేత బయటికి పంపించివేశారు. 10.45 గంటలకు వైఎస్సార్ సీపీ నియోజవర్గ నేత వై.వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా, గుత్తి మాజీ సర్పంచు పీరా, నాయకులు సుంకం రఫీ, న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి తదితరులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు 10 మందితో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు రమేష్‌బాబు, వెంకటేష్, లక్ష్మీదేవిలతో కలిసి భారీ బందోబస్తు మధ్య వచ్చారు.
అయితే తలుపుల వద్దే కూర్చున్న జేసీ, కొట్రికె శ్రీహరి అమాంతంగా రమేష్‌బాబును లాక్కుని తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహించి టీడీపీ నేతలతో గొడవకు దిగారు. సీఐ మోహన్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డితో పాటు బీఎస్‌ఎఫ్ పోలీసులు ఎంత ప్రయత్నించినా సద్దుమణగలేదు. చివరకు లాఠీచార్‌జ చేయడంతో గంటపాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌన్సిల్ హాలులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. స్వతంత్ర కౌన్సిలర్ రమేష్‌బాబు తనకు కేటాయించిన స్థానంలో కాకుండా జేసీ పక్కన కూర్చోవడంపై వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కమలాక్షమ్మ అభ్యంతరం తెలపడంతో మామాటా పెరిగింది.
చివరకు పీఓ జోక్యం చేసుకుని రమేష్‌బాబును మరో చోట కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ తరపున చైర్‌పర్సన్‌గా కమలాక్షమ్మను కౌన్సిలర్లు నజీర్, వరలక్ష్మిలు ప్రతిపాదించి బలపరిచారు. టీడీపీ తరఫున తులసమ్మను కౌన్సిలర్లు రమేష్‌బాబు, గోవిందు ప్రతిపాదించి బలపరిచారు. మొత్తం 24 మంది సభ్యులకు గాను వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థికి ఆ పార్టీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు, ఇద్దరు స్వతంత్రులు (వెంకటేష్, లక్ష్మిదేవి)తో కలిసి చేతులెత్తగా 12 మంది అయ్యారు. వైఎస్సార్‌సీపీ 21వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి గైర్హాజరయ్యారు.
టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తులసమ్మకు అనుకూలంగా టీడీపీ కౌన్సిలర్లు 8 మంది, ముగ్గురు స్వతంత్రులతోపాటు ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు (ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్) చేతులెత్తడం తో 13 మంది అయ్యారు. వైస్ చైర్మన్ స్థానానికి టీడీపీ కౌన్సిలర్ ఆర్.బి.పురుషోత్తంకు కూడా 13 మంది అనుకూలంగా చేతులెత్తారు. దీంతో ఒక్క ఓటు తేడాతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ స్థానాల ను టీడీపీ దక్కించుకున్నట్లు పీఓ ప్రకటించారు. ఒక వేళ వైఎస్సా ర్ సీపీ కౌన్సిలర్ విజయలక్ష్మి ఓటింగ్‌కు హాజరై ఉంటే 13-13 ఓట్లతో టై అయ్యేది. దీంతో లాటరీ ద్వారా ఫలితం తేలేది.
గుత్తి మునిసిపాలిటీలో హై డ్రామా
Published Fri, Jul 4 2014 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement