అమ్మాయిని అబ్బాయిగా మార్చిన జబ్బు
Published Thu, Mar 30 2017 8:09 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
గుంటూరు: ఒకొక్కరికి ఒక్కొ వ్యాధి అన్నట్టు ఈ అమ్మాయి వ్యాధి అబ్బాయిలా ప్రవర్తించడం. తలలో ఏర్పడిన గడ్డ( ట్యూమర్) వల్ల తొమ్మిదేళ్ళ బాలిక అబ్బాయిగా మారింది. తన పేరు అబ్బాయి పేరుగా తానే మార్చుకుంది. ఆ బాలికలో తొమ్మిదినెలలుగా వింత ప్రవర్తన కనిపిస్తోంది.
కుమార్తెకు వచ్చిన అంతుపట్టని వ్యాధిపై విసిగి వేసారినన తల్లిదండ్రులు చిట్టచివరకు డిసెంబర్‌లో గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. గుంటూరు ఏటిఅగ్రహారం 12వ లైన్‌కు చెందిన కట్టా సాంబశివరావు, సబ్బులు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పండ్ల వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్న సాంబశివరావు పెద్ద కుమార్తె ఉమాశ్రావణి(9) నల్లపాడు కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి చదువుతోంది. ఎవరినైనా తీవ్ర దుర్భాషలాడుతుంది. ఎవ్వరికీ భయపడదు. మొండి తనం, కోపం ఎక్కువ. అడిగింది తక్షణమే ఇవ్వాల్సిందే. అడిగినవి కొనివ్వలేదని రెండుసార్లు ఉమాశ్రావణి తన చేతులు తానే కోసుకుంది. ఒంటిపై బట్టలు ఉంచుకోదు. బాలిక ఉమాశ్రావణికి ఫిబ్రవరి 25న మూడుగంటల సేపు ఆపరేషన్ నిర్వహించి మెదడు నుంచి ట్యూమర్‌ను తొలగించినట్లు న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌డాక్టర్ భవనం హనుమా శ్రీనివాసరెడ్డి చెప్పారు.
సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలికకు ఉచితంగా చేశామన్నారు. ప్రస్తుతం 70శాతం బాలిక సాధారణ స్థితికి చేరుకుందని, రెండు నెలల్లో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందన్నారు. సర్జరీతోపాటు, మందులు సైతం ఉచితంగా అందించినట్లు డాక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆపరేషన్ ప్రక్రియలో తనకు డాక్టర్ ప్రవీణ్ సహకారం అందించారన్నారు. ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తెను సాధారణ స్థితికి తీసుకొచ్చిన డాక్టర్ సుందరాచారి, డాక్టర్‌శ్రీనివాసరెడ్డిలకు బాలిక తండ్రి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం ఈ ఇరువురు వైద్యులకు తాను రుణపడి ఉంటానని వెల్లడించారు.
Advertisement