కేసు వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కరోనాతో తల్లిని పోగొట్టుకున్న పదమూడేళ్ల బాలికను తాను చూసుకుంటానని తండ్రికి మాయమాటలు చెప్పిన ఓ మహిళ వ్యభిచార కూపంలోకి దింపింది. పలు ప్రాంతాల్లో పలువురి చేతిలో అమానుషానికి గురైన ఆ బాలిక చివరకు తప్పించుకొని వచ్చి, తండ్రికి చెప్పింది. తండ్రి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పది రోజుల్లో కేసును ఛేదించి, 12 మంది నిర్వాహకులు, పలువురు విటులను అరెస్టు చేశారు. గుంటూరు, కృష్ణా, హైదరాబాద్, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఈ ముఠాలో నిర్వాహకులు, విటులు ఉన్నారు.
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం.. హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న గుంటూరు జిల్లాకు చెందిన బాలికకు ఇటీవల కోవిడ్ సోకడంతో ఇంటికి తెచ్చారు. బాలిక తల్లికి కూడా కోవిడ్ సోకడంతో గుంటూరు ద్వారకానగర్ ఏడో వీధికి చెందిన ఎం.స్వర్ణకుమారి నాటుమందు ఇప్పిస్తానని నమ్మించింది. తన కుమార్తె ఇంటి వద్దే ఉంటుందని తండ్రి చెప్పాడు. ఈలోగా బాలిక తల్లి మృతిచెందింది. బాలికను తాను చూసుకుంటానని స్వర్ణకుమారి తండ్రిని నమ్మించి, గుంటూరు చైతన్యపురి 4వ వీధిలోని ఇంటికి తీసుకువచ్చింది. అక్కడ బాలికను నిర్బంధించి, వ్యభిచార కూపంలోకి దింపింది. విజయవాడ, కృష్ణా, తణుకు, నెల్లూరు జిల్లా, హైదరాబాద్, నెల్లూరులో వ్యభిచారం చేయించింది.
నెల్లూరులో ఆమె నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ బస్టాండ్‌కు చేరింది. బాలిక అదృశ్యమైందంటూ స్వర్ణకుమారి గుంటూరు నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విజయవాడ బస్టాండ్‌లో బాలికను మరో నిర్వాహకురాలు పుణ్యవతి అలియాస్ నాగలక్ష్మి బాలికకు మాయమాటలు చెప్పి, తనతో తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. అక్కడ్నుంచి తణుకులోని శారద, అశ్విని వద్దకు పంపింది. బాలికను అశ్విని విజయవాడ తీసుకువచ్చి జేసింత, హేమలతకు అప్పగించి డబ్బులు తీసుకుంది. వారిద్దరూ బాలికతో వ్యభిచారం చేయించారు. తాను ఈ పని చేయలేనని, చదువుకుంటానని బాలిక చెప్పింది. బాలికను తీసుకుని వారు కారులో పాఠశాలకు వచ్చారు. తాము పోలీస్ మహిళా మిత్రలమని పాఠశాల యాజమాన్యానికి చెప్పి, టీసీ ఇవ్వమని కోరారు.
బాలిక తండ్రికి మాత్రమే టీసీ ఇస్తామని వారు బదులిచ్చారు. వారు బాలిక తండ్రిని పిలిపించి, టీసీ తీసుకొని, తాము చదివిస్తామని విజయవాడ తీసుకెళ్లారు. మళ్లీ వ్యభిచారం చేయించడంతో, బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి తండ్రికి విషయం చెప్పింది. తండ్రి వెంటనే మేడికొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును అరండల్ పేట పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు స్వర్ణకుమారిని, ఇతర నిందితుల్లో పలువురిని అరెస్టు చేశారు. వ్యభిచార వృత్తి నిర్వహించే స్వర్ణకుమారి గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ డి.గంగాధరం, పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ కూడా
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment