బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా? | Brahmotsava to clear things? | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా?

Published Thu, Oct 30 2014 5:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా?

బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా?

  • కాంట్రాక్టర్ల సమ్మెతో సందేహం
  •  అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఇక 20 రోజులే!
  • తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నా, బ్రహ్మోత్సవాలలోపు పూర్తవుతాయా అన్నది సందేహమే. సర్వీస్ ట్యాక్సును టీటీడీయే చెల్లించాలని టీటీడీ కాంట్రాక్టర్లు సమ్మె చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
     
    అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 19 నుంచి 27వరకు జరగనున్నాయి. శ్రీవారికి తీసిపోని విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయం, ఉద్యానవనం, తోళపగార్డెన్, ఆలయ పరిసరాలు, మాడవీధులు, పుష్కరిణితో పాటు తిరుపతి నుంచి తిరుచానూరు ఆలయం వరకు స్వాగత విద్యుత్ దీపాల తోరణాలు, వివిధ దేవతా ప్రతిమల విద్యుత్ కటౌట్లను ఏర్పాటుచేయనున్నారు. అలాగే చలువపందిళ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది.

    చక్రస్నానం(పంచమీ తీర్థం) రోజున పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవలే రూ.15 లక్షలతో పుష్కరిణి ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇక మాడవీధుల్లో వాహన సేవా సమయంలో అమ్మవారికి భక్తులు హారతి ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కోసం తోళపగార్డెన్‌లో చలువ పందిళ్లు, ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటుచేస్తారు.అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం కొయ్య రథంపై అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికోసం కొయ్యరథానికి మరమ్మతులు, పెయింటింగ్ చేయాల్సి ఉంది.

    ఇవన్నీ టీటీడీ కాంట్రాక్టర్లు నిర్వహిస్తారు. అయితే 3 రోజుల నుంచి కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. తమ న్యాయమైన కోరికను తీర్చకుంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలను బహిష్కరిస్తామని టీటీడీ కాంట్రాక్టర్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలలోపు ఏర్పాటు పనులు పూర్తవుతాయా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement