బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రావచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. బస, దర్శనం, ప్రయాణంతోపాటు భద్రతలో భాగంగా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులు సంకల్పించారు. ఆమేరకు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు అన్ని విభాగాలను ఆదేశించారు. భద్రతలో భాగంగా ఊరేగింపు సమయంలో, దర్శన క్యూల్లోనూ అగ్ని ప్రమాదాలు... వంటివి విపత్తులు జరిగితే తక్షణమే స్పందించి అన్ని విధాలా ఆదుకునేలా జాతీయ విపత్తు నివారణ సంస్థ అయిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ప్రత్యేక బృందాలను రప్పించనున్నారు. మెరికల్లాంటి యువ కమాం డోలతో కూడిన ఆక్టోపస్ దళాలు నిరంతరం ఆలయ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరిగేలా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఆర్మ్‌డ్ రిజర్వు కమాండోల పహారా ఏర్పాటు చేశారు.
టీటీడీ సెంట్రల్ కమాండెంట్ సెంటర్
బరహ్మోత్సవాలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య అనుగుణంగా టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమవుతోంది. పోలీసు, విజిలెన్స్, టీటీడీ విభాగాలతో ప్రతిసారీ సెంట్రల్ కమాండెంట్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఈసారి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల తరహాలోనే టీటీడీ విజిలెన్స్ విభాగంగా కూడా సుమారు రూ.కోటి విలువైన భద్రతకు సంబంధించి ఆధునిక పరికరాలను సొంతంగా సమకూర్చుకుంది. ఆ పరికరాలను సెంట్రల్ కమాండెంట్ సెంటర్‌లో అన్ని వేళలా సిద్ధంగా ఉంచుతారు. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వేల మంది పోలీసులను నియమించనున్నారు. అలాగే 150 మందికిపైగా బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్‌లు బందోబస్తు నిర్వహిస్తాయి.