ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 5వ రోజైన శనివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని ఓఎస్డీ రవిశంకరరెడ్డి ముద్రగడకు తెలిపారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. ‘‘ఎన్ని రోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి’’ అని డిమాండ్ చేశారు.
అనంతరం చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వం వైఖరికి నిరసన తెలిపారు. ఆయన ఇంటి గేటు వద్ద కాపు జేఏసీ నాయకులు కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సతీమణి పద్మావతి, కుమారుడు గిరి, కోడలు సిరి, మనువరాలు భాగ్యలక్ష్మితో పాటు కాపు జేఏసీ నాయకులతో కలసి ముద్రగడ తన ఇంటి వద్ద కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు.