వివాదానికి విరామం | Break dispute | Sakshi
Sakshi News home page

వివాదానికి విరామం

Published Sun, Feb 15 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

Break dispute

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల మధ్య ఏర్పడిన జల జగడం ఎట్టకేలకు సద్దుమణిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి  కాలువకు నీటి విడుదల విషయం పై నెలకొన్న వివాదం నేపథ్యంలో రెండు రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన రైతులు, అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమై నీటి విడుదలకు అనుకూలంగా నిర్ణయం వెలువడటంతో  హర్షం వ్యక్తం చేశారు.
 
 మాచర్లటౌన్/ విజయపురిసౌత్ : విజయపురిసౌత్‌లోని మోటెల్ కాంప్లెక్స్‌లో నీటి విడుదలకు సంబంధించి శనివారం జరిగిన చర్చలు సఫలీకృతం అయిన అనంతరం అధికారులు విలేకరులతో మాట్లాడారు. విడుదలైన నీరు సద్వినియోగం అయ్యేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నామని వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్, కుడికాలువ చీఫ్ ఇంజనీర్ వీర్రాజులు మాట్లాడుతూ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్  చర్చలు జరిపినట్లు తెలిపారు. నీటి విడుదలకు ప్రభుత్వాలు అంగీకరించటం ఆనందకరమన్నారు. సాగర్ కుడికాలువ పరిధిలోని పంట పొలాలు ఎండిపోకుండా కాపాడేందుకు విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము చేపట్టే చర్యలను గమనించి పొదుపుగా నీటిని ఉపయోగించుకొని ఆరుతడి పంటలకే పరిమితం కావాలన్నారు. ఎక్కడా వరి సాగు చేపట్టవద్దని, ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాలోని ఆరుతడి పంటలకు, ప్రకాశం జిల్లాలోని వరి పంటలకు నీటిని అందించేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులతో సంయుక్తంగా కమిటీలు వేసి, నీటి వినియోగంపై పర్యవేక్షిస్తూ రైతులకు న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ శ్రీధర్, సీఈ వీర్రాజు, ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ జబ్బార్, గురజాల ఆర్డీవో మురళీ, ఇతర డివిజన్ల ఆర్డీవోలతో కలసి మూడు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం నీటి విడుదలపై తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు.
 
 పటిష్ట బందోబస్తు
 ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జల వివాదం నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం ఉదయానికి జేసీ శ్రీధర్, ఐజీ సంజీవ్‌ల పర్యవేక్షణలో ఉదయం నుంచి ప్రాజెక్టు కుడి భాగంలో ప్రధాన గేటు వద్ద టెంటు వేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూశారు. జిల్లా రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఉన్నతాధికారి వివేక్‌కుమార్, డీఎస్పీలు నాగేశ్వరరావు, సుధాకర్‌తో పాటు పలువురు తరలివచ్చారు. వీరితో పాటు సీఐ, ఎస్‌ఐలు,  300 మందికి పైగా పోలీసు సిబ్బంది వేచి ఉన్నారు. గుంటూరు, నరసరావుపేట, గురజాల ఆర్డీవోలతో పాటు పది మంది తహశీల్దార్లతో పాటు వంద మంది రెవెన్యూ సిబ్బంది తరలివచ్చారు.
 
 ప్రాజెక్టుపై ఉన్న ఎస్‌పీఎఫ్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు నీటి విడుదలకు సాగర్ ప్రాజెక్టుపై వెళ్లే ఇంజనీర్లను అడ్డగించటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ అధికారులతో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తున్నామని, సమర్ధించుకునేవిధంగా డ్యామ్ సెక్యూరిటీ అధికారులు సమాధానమిచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు జిల్లా ఉన్నతాధికారులు మాచర్ల నుంచి సాగర్, విజయపురిసౌత్‌కు వెళ్లే రహదారిలో వివిధ ప్రాంతాలకు చెందిన సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేసి తనిఖీలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement