
స్టేషన్ బెయిల్ ఇస్తే రూ. 50 వేలు... ఎఫ్‌ఐఆర్ నుంచి పేర్లు తొలగించాలంటే రూ. లక్ష .. ఫ్యాక్టరీ లైసెన్సు కావాలంటే రూ. 50 వేలు.. రైతు పొలాన్ని కొలవాలంటే రూ. 12 వేలు, ఇంటి పన్ను వేయాలంటే రూ. 15 వేలు.. ఇలా ప్రతి పనికి ఓ ధర నిర్ణయించి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు భారీ స్థాయి అవినీతికి పాల్పడుతున్నారు.
సాక్షి, గుంటూరు: గతంలో ఏసీబీ అధికారుల దాడుల్లో రూ. 5 వేలు నుంచి రూ.10 వేలలోపు లంచం తీసుకుంటూ పట్టుబడిన వారే ఎక్కువగా ఉండేవారు. అయితే రాజధాని ప్రభామో.. అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లించాలనో తెలియదుగానీ ప్రస్తుతం ఏ అధికారిని పట్టుకున్నా రూ. 50 వేల నుంచి రూ. లక్షలో లంచాలు పుచ్చుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు నాలుగు నెలల వ్యవధిలో ఏడుగురు అధికారులపై దాడులు చేసి లంచాలు తీసుకుంటుండగా పట్టుకుని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.
ప్రజల్లో చైతన్యం
లంచాల కోసం వేధించే అధికారులను ఏసీబీకి పట్టించేందుకు ప్రజలు సైతం చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో ఏడు ఏసీబీ రైడ్‌లు జరగ్గా.. ఎనిమిది మంది అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. జిల్లాలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, మెడికల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో పని చేస్తున్న అనేక మంది అధికారులు భారీ స్థాయి అవినీతికి తెగబడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి సారించినప్పటికీ ఎటువంటి భయాందోళనలు లేకుండా యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. దొరికిన వాడే దొంగ అన్న చందంగా వెయ్యి మందికి ఒక్కరు కూడా ఏసీబీకి దొరకడం లేదనేది అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ గతంతో పోలిస్తే ఏసీబీ దాడులు పెరగడం హర్షించదగ్గ విషయం.
అవినీతి అధికారుల బాగోతమిది!
దాచేపల్లి మండలం గామాలపాడు వీఆర్వో బెంజిమన్ ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన అరెస్టు చేశారు. నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషగిరిరావు ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎదురుగా ఉన్న సమయంలో సైతం పోలీసు అధికారుల నుంచి డబ్బు తీసుకు రావాలంటూ ఫోన్ రావడంతో ఫిబ్రవరి 21వ తేదీన రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నూజెండ్ల మండల సర్వేయర్ మల్లెల నాగేశ్వరరావు సర్వే రిపోర్టు ఇచ్చేందుకు ఓ రైతు నుంచి రూ. 12 వేలు డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మార్చి 15వ తేదీన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అరెస్టు చేశారు.
మాచర్ల మున్సిపాలిటీలో ఆర్‌ఐగా పని చేస్తున్న ఓలేటి నాగభూషణం ఇంటి పన్ను వేసేందుకు రూ. 15 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏప్రిల్ 26వ తేదీన ఏసీబీ అధికారులతో కలిసి వెళ్లి పట్టించారు. పాతగుంటూరు ఎస్సై వెంకటనరసింహారావు ఓ కేసు నుంచి తప్పించాలంటే రూ. లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మే 24న ఎస్సైను పట్టుకున్నారు. ఎస్సై స్థాయి అధికారి ఒక్క సులో ఇంత మొత్తం డిమాండ్ చేయడం తీవ్ర సంచలనం కలిగించింది. గుంటూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్ ఇళ్లపై మే 30న ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఓ కోల్డ్‌స్టోరేజీకి లైసెన్సు మంజూరు చేసేందుకు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కే కేశవులు రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
లంచం అడిగితే ఏసీబీకి చెప్పండి
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల కోసం పీడిస్తే వెంటనే మాకు సమాచారం అందించండి. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే 9491305638 నంబరును సంప్రదించండి.– దేవానంద్ శాంతో,ఏసీబీ డీఎస్పీ, గుంటూరు