కొట్టుకుపోయిన యర్రగొండ వంతెన ప్రాంతం
కొయ్యూరు(పాడేరు): యూ.చీడిపాలెం పంచా యతీ కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో యర్రగొండ ఉంది. యర్రగొండ దాటగానే కాలువ ఉంటుంది. దీనిపై ఎప్పుడో నిర్మాణం చేసిన వంతెన రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కాలువ దాటి అటు తీగలమెట్ట, గంగవరం, నీలవరం, పాలసముద్రం, మర్రిపాకలు, జెర్రిగొంధి వెళ్తారు. ఇప్పుడు ఈ ఆరు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గతంలో ద్విచక్ర వాహనాలు లేదా జీపుల ద్వారా మర్రిపాకల వరకు వెళ్లేందుకు వీలుండేది. ఇప్పుడు నడచి వెళ్లడమే కష్టంగా మారింది. ఇక పలకజీడి నుంచి నీలవరం, గంగవరం వెళ్లేందుకు మార్గం ఉన్నా కాలువను దాటాలి. ఇటీవల కాలువపై చెట్టు కర్రను అడ్డంగా పెట్టి ఉంచారు. దానిపై నుంచి రేషన్ బియ్యం తీసుకువస్తున్న ధర్మయ్య అనే యువకుడు కాలువలో పడిపోయాడు. బియ్యం బస్తాపై ఆయన పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు రేషన్ సరకులను కూడా తీసుకెళ్లే అవకాశం లేదు. వర్షాలు తగ్గితేనే తిరిగి రాకపోకలు పునరుద్ధరించే వీలుంది. ప్రధానంగా కాలువల ఉధృతి తగ్గాల్సి ఉంది. పాడేరు ఐటీడీఏ అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆరు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment