కొండాయి.. కష్టం కొండంత | 8 people killed as bridge at Kondai | Sakshi
Sakshi News home page

కొండాయి.. కష్టం కొండంత

Published Sat, Jul 27 2024 6:11 AM | Last Updated on Sat, Jul 27 2024 6:11 AM

8 people killed as bridge at Kondai

జల ప్రళయానికి ఏడాది 

కొండాయి వద్ద 8 మందిని బలిగొన్న బ్రిడ్జి

కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగక వానొస్తే.. ఏ అవసరమొచ్చినా 42 కిలోమీటర్లు  వెళ్లాల్సిన దుస్థితి

గత ఏడాది జూలై 27న వాన.. వరదై.. జలప్రళయంగా మారి రెండు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది.  ములుగు జిల్లా కొండాయిలో బ్రిడ్జి దాటుతున్న ఎనిమిది మందిని బలితీసుకుంది. అదే సమయంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. ఐదుగురు గల్లంతు కాగా, వారిలో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆ కుటుంబాలు వారి చివరి చూపునకు నోచుకోకుండా పోయాయి. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి బృందం ఆ రెండు గ్రామాలను సందర్శించింది.

ఏటూరునాగారం/భూపాలపల్లి అర్బన్‌/భూపాలపల్లి రూరల్‌
 ఏడాది కాలంగా బ్రిడ్జి నిర్మించని కారణంగా వానొస్తే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్తులు ఏది కావాలన్నా.. 42 కిలోమీటర్ల దూరంలోని ఏటూరునాగారానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉంటే..12 కిలోమీటర్లు ప్రయా ణించి ఏటూరునాగారం చేరుకునేవారు.   ప్రస్తుతం చుట్టూ తిరగలేక  ఇంటి వద్దనే కలోగంజి తాగుతున్నారు. ఊరంతా దోమల బెడద. వర్షాలు వస్తే...వాగు దాటలేక గ్రామంలోనే  మగ్గిపోతున్నారు.  2023 జూలై 27వ తేదీ సాయంత్రం 4 తర్వాత భారీ వర్షాలు  కొండాయి, మల్యాల గ్రామాలను అతలాకుతలం చేశాయి.

ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలడంతో దానిపై నడుచుకుంటూ వెళుతున్న   8 మంది (రషీద్, కరింబీ, మజీద్, బీబీ, నజీర్‌ఖాన్, షరీఫ్, మహబూబ్‌ఖాన్, దబ్బగట్ల సమ్మక్క) అసువులు బాశారు. ఏడాది గడిచినా, ఆ విషాదచాయలు అలానే ఉన్నాయి. కొండాయి– దొడ్ల గ్రామాల మధ్య గల జంపన్నవాగుపై నిర్మించి ఉన్న హైలెవల్‌ బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎలాంటి బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇటీవల ఐటీడీఏ అధికా రులు రూ.35 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న ఫుట్‌ ఓవర్‌ ఐరన్‌ బ్రిడ్జి సైతం ఇటీవల వరదలకు కూలిపోయింది.

వెల్డింగ్, పిల్లర్లు సైతం ఊడిపోయి వాగులో కలిసిపోయాయి. బ్రిడ్జిని అమర్చే క్రేన్‌ సైతం వాగులో కూరుకుపోయింది. దీంతో అధికారులు పడవ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలోనే ఈ పడవను నడుపుతు న్నారు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీల్లో ఆకలికేకలు మొదలయ్యాయి. ప్రజలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి సీతక్క రూ. 9.50 కోట్లు మంజూరు చేయించింది. కానీ టెండర్లు కాక పనులు మొదలు కాలేదు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మిస్తే గానీ తమ బతుకులు బాగుపడవని కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇప్పుడు ఇలా వెళ్తున్నారు..
కొండాయి నుంచి పది కిలోమీటర్ల దూరంలోని ఊరట్టం నుంచి మేడారం మీదుగా రెండు కిలోమీటర్లు ప్రయాణించి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయికి చేరుకోవాలి. అక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం రావాలి. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలు నరకయాతన పడుతూ ప్రయాణిస్తున్నారు. అదే కొండాయి వద్ద బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కేవలం 12 కిలోమీటర్లు ప్రయాణించి ఏటూరునాగారం చేరుకుంటారు.   

పచ్చడి మెతుకులతో..
కొండాయికి సరైన రోడ్డుమార్గం లేక నిత్యావసర సరుకులు నిండుకొని పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నాం, ఎలాంటి పనులు లేవు. వ్యవసాయం లేదు, కూలీకి పోయేందుకు దారిలేదు. రేషన్‌ షాపులో ఇచ్చిన దొడ్డుబియ్యం వండుకొని పచ్చడి వేసుకొని ఇంటిల్లిపాది పూట గడుపుతున్నాం. – కాక ఫణిచందర్, కొండాయి

‘మోరంచ’.. మొర ఆలకించేదెవరు?
వాగులో ఐదుగురు గల్లంతు.. ఇప్పటికీ దొరకని ఇద్దరి ఆచూకీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు పక్కనే ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. గ్రామస్తులందరూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్నారు. ఐదుగురు వరదలో కొట్టుకుపోగా, ముగ్గురి మృతదేహాలు పంట పొలాల్లో లభించాయి. ఒక మహిళ, యాచకుడి మృతదేహం జాడ ఇప్పటికీ దొరకలేదు. గ్రామంలో ఎవరిని కదిలించినా వరద ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో  ఆందోళన చెందుతున్నారు.  

ప్రభుత్వ సాయం నామమాత్రమే..
గ్రామంలోని 20 చెంచు కుటుంబాలు సర్వం కోల్పోగా, ప్రభుత్వం సాయం అంతంత మాత్రమే అందింది. ఆ సమయంలో తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి కేవలం రూ.10వేల నగదు, నిత్యావసర వస్తువులు, పాడి గేదెలు ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన, ఇతర వస్తువులు, పంటలు నష్టపోయిన, వాహనాలు కొట్టుకుపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు. మరణించిన ముగ్గురి కుటుంబాలకు పరిహారం రాగా, ఇప్పటికి ఆచూకీ లభించని గడ్డం మహాలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. 

ఏడాదైనా నా భార్య ఆచూకీ లేదు.. 
గత ఏడాది తెల్లవారు జూమున వచ్చిన వరదలో కొట్టుకుపోయిన నా భార్య ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. గుర్తు తెలి యని మహిళలు ఎక్కడ చనిపోయి కనిపించినా అక్కడకు  వెళ్లి చూశాం. ఇటీవలే  నా భార్య సంవత్సరీకం చేశాను. ఒంటరిగా ఉండలేక నా కూతుళ్ల వద్ద ఉంటున్నా. – గడ్డం శ్రీనివాస్, మృతురాలు మహాలక్ష్మి భర్త

తాతయ్య, నానమ్మలను కోల్పోయాం 
తాత మజీద్, నానమ్మ బీబీతో పాటు కొండాయిలో ఉండే వాళ్లం. గత ఏడాది మా కుటుంబంలో మజీద్, బీబీని వాగు మింగేసింది. ఆ భయంతో ఇప్పుడు ఏటూరు నాగారంలో ఉంటున్నాం. చిన్నషాపు పెట్టు కొని జీవిస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఆ దుర్ఘటన గుర్తుకొస్తుంది.     – రియాజ్‌ , కొండాయి

కాలు జారితే ఖతం..
హనుమకొండలోని నయీంనగర్‌ వంతెన నిర్మాణ పనులు కొనసాగు తుండడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లేవారికి కష్టాలు తప్పడం లేదు. నయీంనగర్‌లో కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్, బాలికలు, బాలుర వసతి గృహాలతో  చాలా రద్దీగా ఉంటుంది. వంతెన చుట్టూ తిరిగి వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండటంతో.. విద్యార్థులు, ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రమాదకర మైన కట్టెల నిచ్చెనపై నుంచి నాలా దాటుతున్నారు. వర్షా నికి నిచ్చెన తడిసి విరిగిపోయినా, కాలు జారినా నాలాలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది.     – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, హనుమకొండ

వాగులు దాటి వైద్యం..
కన్నాయిగూడెం: ములుగు జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా జ్వరాలు, ఇతర వ్యాధులు ఎక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడానికి ఏజెన్సీ గ్రామాల బాటపట్టారు. ఈ క్రమంలో కొండాయి సబ్‌సెంటర్‌ పరిధి వైద్యు డు ప్రణీత్‌ కుమార్‌ తమ సిబ్బందితో కలసి ఏటూరునాగారం నుంచి సర్వాయిరోడ్డు మార్గాన 40కి.మీ. ప్రయాణించి అడవి, వాగులు దాటుకుంటూ మారు మూలన ఉన్న కన్నాయి గూడెం మండలం ఐలాపుర్‌ గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. స్థానిక ప్రజలకు వైద్యం అందించారు. వారు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో చంటిపిల్లతో వస్తున్న వారికి అడవిలోనే వైద్యం చేశారు.

మందుకొట్టి.. చావగొట్టి
ఎల్లారెడ్డి: డ్రిల్‌ పీరియడ్‌లో ఆటలాడుకుంటున్న విద్యార్థులను.. మద్యం మత్తులో ఉన్న అటెండర్‌ చితకబాదడంతో గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పాఠశాల డ్రిల్‌ పీరియడ్‌లో ఆరో తరగతి విద్యార్థులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న అటెండర్‌.. వారి వద్దకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారంటూ కర్రతో ఇష్టమొచ్చి నట్లు కొట్టాడు.

దీంతో విద్యార్థులు రామ్, లక్ష్మ ణ్, అజయ్‌లతో పాటు మరికొందరి ఒంటిపై వాతలు తేలాయి. తీవ్ర నొప్పి తో బాధపడుతున్న రామ్, లక్ష్మణ్, అజయ్‌లను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. తరచూ విధుల్లో మద్యం తాగుతున్న అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement