గోదావరి వరదలో మునిగిన ఏటూరునాగారం మండల కేంద్రంలోని దళిత కాలనీ ఇళ్లు (డ్రోన్‌ఫొటో)
ఏటూరునాగారం/మంగపేట/ఎస్‌ఎస్ తాడ్వాయి/మహాముత్తారం/కాళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతిస్తున్నా పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో వరద ఉండిపోగా.. కొన్ని గ్రామాల్లో తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు కాలనీలు, రామన్నగూడెం, రాంనగర్, లంబాడీతండా, రొయ్యూరు గ్రామాలు ఇంకా ముంపులో ఉన్నాయి.
మిగతా గ్రామాల్లో వరద తగ్గడంతో జనం పునరావాస శిబిరాల నుంచి ఇంటిముఖం పడుతున్నారు. తడిసిన వస్తువులు, మంచాలు, వంట సామగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదతో ఏటూరునాగారం మండలంలో 48 ఇళ్లు కూలిపోయాయి. నీట మునిగిన గ్రామాల్లో ఇళ్లు, వీధులు, రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.
ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు రెండు బ్రిడ్జీలపై నుంచి వచ్చిన వరద వ్యాపారుల దుకాణాలను ముంచెత్తింది. మినరల్ వాటర్ ప్లాంట్ మోటార్లు. వంట సామగ్రి పాడైపోయాయి. కొన్ని సామాన్లు వరదలో కొట్టుకుపోయాయని వ్యాపారులు తెలిపారు. మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం, రాజుపేట, అకినేపల్లి మల్లారంలో గోదావరి తీరం వెంట లోతట్టు ప్రాంతాలను వరద వీడలేదు. మంగపేటలోని వడ్డెర కాలనీలో ఇళ్లు బయటపడ్డాయి.
భారీగా రోడ్లు ధ్వంసం
జంపన్నవాగు వరదకు కొత్తూరు నుంచి రెడ్డిగూడెంకు వచ్చే దారిలో కల్వర్టు, సీసీ రోడ్డు కోతకు గుర య్యాయి. తూములవాగు వరద తాకిడికి ఊరట్టం సీసీ రోడ్డు కింది భాగం కోతకు గురై పెద్ద గొయ్యి ఏర్పడింది. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవాపూర్ సమీపంలోని మేడారం వెళ్లే డబుల్ రోడ్డు వందమీటర్ల పొడవు నా తెగిపోయింది. కొంచెం దూరంలో డబుల్ రోడ్డు ఓవైపు యాభై మీటర్ల పొడవున కోతకు గురైంది.
ఈ మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలో 80 శాతం రహదారులు తెగిపోవడంతో.. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాళేశ్వరం పరిధిలోని అన్నారం కెనాల్ కట్టపై వరదకు బీటీ రోడ్ కనిపించకుండా ఇసుక మేటలు వేసింది. కాళేశ్వరం నుంచి సిరొంచ వెళ్లే జాతీయ రహదారి పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment