పట్టపగలు భారీ చోరీ | Broad daylight massive crime | Sakshi
Sakshi News home page

పట్టపగలు భారీ చోరీ

Published Fri, Jun 13 2014 2:19 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

పట్టపగలు భారీ చోరీ - Sakshi

పట్టపగలు భారీ చోరీ

బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో దొంగలు మళ్లీ విరుచుకుపడ్డారు. రెండు వారాల క్రితం వరుసగా మూడు చోట్ల చోరీలు చేశారు. మళ్లీ గురువారం భారీ ఎత్తున నగదు, ఆభరణాలు అపహరించారు.  పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉన్నా అటువైపు చూడని దొంగలు, ఇంట్లో భారీగా నగలు, డబ్బు ఉంచారన్న సంగతి తెలుసుకొని పట్టపగలు దోచుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఫూల్‌బాగ్‌కాలనీలో ప్రధాన రహదారి పక్కన గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న కేఎల్‌వీఆర్ ప్రసాద్ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును అపహరించుకుపోయారు. ఎంఈఓ ప్రసాద్ భార్య విజయ బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు.
 
 వీరి కుమార్తెకు గత నెల 24న వివాహం చేయడంతో అప్పటి వరకూ లాకర్లలో ఉండే నగలను బయటకు తీసుకువచ్చారు. వివాహం అనంతరం కూతురు, అల్లుడు, బంధువులతో కలిిసి   పది రోజుల పాటు బెంగళూరులో ఉన్నారు. అక్కడ కొత్త దంపతుల నివాసానికి అవసరమైనవి ఏర్పాటు చేసి తిరిగి బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు.  బెంగళూరు నుంచి వచ్చినపుడు కుమార్తెకు చేయించిన 25 తులాల హారం, నక్లెస్, నాలుగు గాజులు, ఉంగరాలు వంటివి బొబ్బిలిలోని లాకర్లలో పెట్టడానికి తిరిగి తీసుకొచ్చేశారు. విజయ తనదగ్గరున్న పది తులాల నల్లపూసలు, గొలుసు, ఉంగరాలతో పాటు కుమార్తెకు చెందిన 25 తులాలను లాకర్లలో పెట్టాలనుకున్నారు. అయితే గత పది రోజులుగా సెలవులో ఉండడంతో  గురువారం కార్యాలయానికి వెళ్లి,  శుక్రవారం బ్యాంకు లాకర్లలో పెట్టాలని నిర్ణయించుకొని వాటిని ఇంట్లో బీరువాల్లో   భద్రపరిచారు.
 
 ఈ విషయం గమనించిన దొంగలు చాకచక్యంగా తలుపు తాళం తొలగించి లోపలకు వెళ్లారు. ఒక  బెడ్‌రూంలోని బీరువాను పూర్తిగా తీసేసి విలువైన వస్తువులను తీసుకెళ్లారు. రెండో బెడ్‌రూంలో అసలు బీరువా ఉంది. గతంలో మరుగుదొడ్లు ఉన్నస్థానంలో అక్కడ బీరువా ఉందన్న సంగతి ఎవరికి తెలియని విధంగా దానిని అమర్చారు.   అయితే దానిని కూడా గుర్తించి బయటకు తీసుకువచ్చి మరీ పగలగొట్టారు. బంగారంతో పాటు  బీరువాల్లో ఉన్న 200 తులాల వెండి వస్తువులు పట్టుకెళ్లిపోయారు. ఇక పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చేందుకు  డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టిన లక్షా 75 వేల రూపాయలను   కూడా అపహరించారు. ఇరిగేషన్ కార్యాలయం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకున్న విజయ తలుపులు తీసి ఉండడం చూసి గాబరాపడుతూ లోపలకు వెళ్లగా మొత్తం బీరువాలు తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో బోరున విలపిస్తూ భర్త ప్రసాద్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాయుడు వచ్చి పరిశీలించారు. అనంతరం పోలీసులు పట్టణమంతా అప్రమత్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement