పండు-సీతమ్మ కుమార్తెలు, వారి పిల్లలు
సాక్షి, బొబ్బిలి: మూఢ నమ్మకంతో వారు రాక్షసంగా ప్రవర్తించారు. మూర్ఖంగా వ్యవహరించినందుకు మూల్యం చెల్లించుకున్నారు. చేతబడి ఉందన్న అనుమానంతో ఇద్దరిని అతి దారుణంగా హతమార్చారు. న్యాయమూర్తి సంచలన తీర్పుతో వారంతా ఇప్పుడు జీవిత ఖైదీలుగా మారారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ఎస్ పెద్దవలస పంచాయతీలోని కేకే వలస గ్రామానికి చెందిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బొబ్బిలిలోని రెండో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి బి శ్రీనివాసరావు శుక్రవారం ఇచ్చిన తీర్పు ఇక్కడ కలకలం సృష్టించింది. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం... కేకే వలసలో నివాసం ఉంటున్న జన్ని శ్రీను కాలికి దెబ్బతగిలి అనారోగ్యంపాలై 2016 జనవరి ఎనిమిదో తేదీన మృతి చెందాడు. ఆయన మృతికి గ్రామంలో ఉన్న గొల్లూరి పండు, సీతమ్మల చేతబడే కారణమని గ్రామస్తులంతా మరునాడే పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించారు. ఆ రోజు ఏమీ తేలకపోవడంతో మరోసారి అదే నెల 12న మళ్లీ పంచాయితీ నిర్వహిద్దామని పెద్దలు చెప్పారు. దీనిని పట్టించుకోని గ్రామానికి చెందిన 13 మంది వ్యక్తులు జనవరి తొమ్మిదో తేదీ సాయంత్రం పండు, సీతమ్మలను రాళ్లతో కొడుతూ, తన్నుకుంటూ సమీపంలోని చిట్టిగెడ్డ వరకూ ఈడ్చుకుపోయారు.
హత్యకు గురైన దంపతులు పండు, సీతమ్మ (ఫైల్)
అక్కడ వారికి కొనప్రాణం ఉండగానే దహనం చేశారు. అదేరోజు రాత్రి భస్మాలను, మిగిలిన ఎముకలను కనిపించకుండా గెడ్డలోనే పారబోశారు. అనంతరం దంపతులను దహనం చేసిన చోట కడిగేసి సాక్ష్యాలను మిగల్చకుండా చేశారు. దంపతుల మరణంపై అనుమానం ఉన్న వారి రెండో కుమార్తె సూరమ్మ మక్కువ పోలీసు స్టేషన్‌లో 13న ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులకు తాము ముగ్గురు కుమార్తెలమనీ, తల్లిదండ్రులను సజీవంగా దహనం చేశారనీ, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే సాలూరు సీఐ జి.రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లడం, ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించడంతో పలు విషయాలను గుర్తించారు. పండు, సీతమ్మల హత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన 13మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. సంఘటన వెలుగు చూసిన తరువాత ఏఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా చిట్టిగెడ్డకు వెళ్లి పరిశీలన చేశారు. అనంతరం పలుమార్లు పార్వతీపురం, బొబ్బిలి కోర్టులో కేసు విచారణకు వచ్చింది. గ్రామంలో ఓ వ్యక్తి ఈ హత్యోదంతాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసులు దానినే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు. పార్వతీపురం, బొబ్బిలి కోర్టులలో పలుమార్లు ఈ వీడియోను న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించారు.
బొబ్బిలిలో తుదితీర్పు...
పలుమార్లు విచారణ అనంతరం చివరగా శుక్రవారం నాడు బొబ్బిలి రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు ఐపీసీ సెక్షన్ 302, 204, 506(2), 120(బి), రెడ్‌విత్ 149 ప్రకారం 12 మంది నిందితులను నేరస్తులుగా పరిగణిస్తూ బతికి ఉన్నంత కాలం కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు. అలాగే ఒక్కొక్కరికీ రూ.2,600 జరిమానా విధించారు. ఫిర్యాదు దారయిన గొల్లూరి పండు, సీతమ్మల కుమార్తెకు రూ.5లక్షల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సలహా సంఘానికి సిఫార్సు చేశారు. నిందితుల్లోని ఒకరయిన గొల్లూరి అర్జున ఈ నేరం చేయకూడదని మిగతా వారిని వారించినట్టు రుజువు కావడంతో అతనిని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు వారితో మీరు చేసిన ఈ నేరానికి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధించొచ్చనీ వ్యాఖ్యానించారు. దీనిపై మీ మనోగతమేంటని న్యాయమూర్తి అడగ్గా నిందితులెవరూ మాట్లాడలేకపోయారు. దీంతో న్యాయమూర్తి నిందితులకు శిక్షను ఖరారు చేశారు.
నేరస్థులు వీరే!
గొల్లూరి పండు, సీతమ్మల హత్యోదంతానికి కారణమయిన నేరస్తులుగా గ్రామానికి చెందిన పాలిక వెంకట రావు, జన్ని గంగరాజు, జన్ని గోవింద, పాలిక చంద్రరావు, జన్ని ధర్మారావు, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాశిరావు, జన్ని ముకుంద, పాలిక జగ్గులు అలియాస్ జగ్గు, జన్ని అప్పలస్వామి, పాలిక మల్లన్నలను నేరస్థులుగా గుర్తిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. బొబ్బిలిలో తుది తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టుకు పలు వాహనాల్లో 13 మంది నిందితుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే 12 మంది నేరస్తుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఒక్క సారి ఘొల్లుమన్నారు. వీరిని పోలీసులు కాసేపు నేరస్థులతో మాట్లాడించేందుకు అవకాశమిచ్చిన వెంటనే తిరిగి కోర్టు బయటకు పంపేశారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీసు బలగాలతో వీరిని తరలించారు. కాగా హతులు గొల్లూరి పండు, సత్తెమ్మలకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో పెద్దకుమార్తె చోడిపల్లి రాధ, రెండో కుమార్తె సూరమ్మ, మూడో కుమార్తె గొల్లూరు నరసమ్మలతో పాటు వారి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయమూర్తి తీర్పు తమ కుటుంబానికి న్యాయం చేసిందని, జడ్జి తీర్పుపై సంతోషం ప్రకటించినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఎస్పీ అభినందన
సాక్ష్యాలను సమయానుకూలంగా ప్రవేశపెట్టడంతో పాటు కేసును విచారించేందుకు సహకరించడం, నేరస్తులకు శిక్ష పడేలా వ్యవహరించిన అప్పటి సీఐ జి.రామకృష్ణ, కోర్టు లైజెనింగ్ అధికారి ఎస్.షణ్ముఖ రావు, కోర్టు కానిస్టేబుల్ మురళి, పీపీలు అద్దేపల్లి నారాయణ రావు, రఘురాంలను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment