సాక్షి, బొబ్బిలి (విజయనగరం): తెలంగాణలోని వరంగల్‌లో ఓ తొమ్మిదినెలల పసికందుపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్నేహితుడికోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని ఐదుగురు యువకులు కొన్నాళ్లపాటు లైంగికదాడిచేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశారు. గుర్ల మండలం దేవుని కణపాకకు చెందిన పశువుల కాపరిగా ఉన్న ఓ యువతిని అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు పశువుల కాపర్లు లైంగిక దాడికి పాల్పడటమే గాకుండా... ఆ చిత్రాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
ఈ సంఘటనలు మరువక ముందే తాజాగా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఆకతాయి లైంగికదాడికి పాల్పడటమే గాకుండా దీనిపై నిలదీస్తే తాను చనిపోతానంటూ బెదిరించి ఊరు విడిచి వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఆ చిన్నారిపై జాలి చూపకపోగా నిందితుడిపక్షాన నిలవడానికి యత్నించి ఇప్పుడు అభాసుపాలయ్యారు. బతుకు తెరువుకోసం ఊరుగాని ఊరొచ్చి... గుట్టుగా కాపురం చేసుకుంటున్న ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దంపతులు ఏడాదిన్నర క్రితం బొబ్బిలి మండలం పెంట వచ్చి స్థిరపడ్డారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది.
బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో కుటుంబ పెద్ద పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గిరడ లక్ష్మణరావు అనే యువకుడు చిన్నారులందరినీ ఆటలాడిస్తుండేవాడు. గత మంగళవారం అలాగే ఆటలాడిస్తూ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగడంతో గుర్తించిన తల్లి, చిన్నారిని ప్రశ్నించేసరికి విషయం బయటపడింది. వెంటనే ఆమె భర్తకు విషయం తెలియజేయడంతో గ్రామపెద్దల వద్దకు విషయం వెళ్లింది. దీనిపై లక్ష్మణరావును నిలదీయగా భయపడి తాను చనిపోతానని బెదిరించి గ్రామం విడిచి పారిపోయాడు. నిందితుడు ఆత్మహత్యచేసుకుంటాడేమో... ఆ కేసు తమపైకి వస్తుందేమోనన్న భయంతో బాధితకుటుంబం మౌనం వహించింది.
అమ్మమ్మ పెంపకంలోనే యువకుడు...
నిందితుడు లక్ష్మణరావుకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇటీవలే తండ్రి మరణించడంతో అమ్మమ్మ సావు సింహాచలం వద్ద పెరుగుతున్నాడు. లక్ష్మణరావుకు రామారావు అనే కవల సోదరుడు ఉన్నాడు. వీరిద్దరినీ సింహాచలం కూలీ చేసి పెంచుతోంది. లక్ష్మణరావు బొబ్బిలిలో ఓ ప్రైవేటు ఐటీఐలో చదువుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే అందరినీ భయపెట్టి ముందుగా బాడంగి మండలం కోడూరు వెళ్లి తరువాత కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఉంటున్న వరుసకు సోదరుడి ఇంటికి పారి పోయాడు.
రంగంలోకి దిగిన పెద్దలు
గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు బాధితకుటుంబం తమ గ్రామానికి చెందిన వారు కాకపోవడం, నిందితుడు తమ గ్రామస్తుడు కావడంతో పక్షపాత ధోరణితో వ్యవహరించి లక్ష్మణరావు వద్ద ఏమీ లేదని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తాము చర్యలు చేపడతామని, లక్ష్మణరావుకు ఏమైనా అయినా, ఆతను ఆత్మహత్యచేసుకున్నా బాధిత కుటుంబానికి సంబంధం లేదని అభయమిస్తూ రాతపూర్వకంగా పెద్దలు అంగీకార పత్రాన్ని రాశారు.
‘సాక్షి’కి సమాచారంతో ఘటన వెలుగులోకి...
సంఘటనపై సాక్షికి ఓ వ్యక్తి సోమవారం సమాచారం ఇచ్చారు. వెంటనే పెంట గ్రామానికి వెళ్లగా అలాంటి సంఘటన జరగలేదని, అదంతా కట్టుకథ అని నమ్మించే యత్నం చేశారు. పోలీసులను అడిగినా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. నిందితుడిని కాపాడితే అందరూ ఇబ్బంది పడతారని సాక్షి హెచ్చరించడంతో విషయం బయటకు పొక్కిందనే భయంతో పెద్దలు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి బాధిత బాలికను సోమవారం రాత్రి బొబ్బిలి సీహెచ్‌సీలో చేర్పించాలని సలహా ఇచ్చారు. నిందితుడిని ఉయ్యూరునుంచి రావాలని సూచించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి సీహెచ్‌సీలో చేర్పించిన బాధిత బాలికకు ప్రభు త్వ వైద్యులు వైద్యపరీక్షలు చేసి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గజపతినగరం మండలం బూర్జవలస పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు తెలిసింది.
నిందితుడిపై పోక్సో చట్టం...?
పోలీసుల అదుపులో ఉన్న నిందిడుతపై పోక్సో(ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొబ్బిలి ఏఎస్‌పీ గౌతమిశాలి ఈ విషయంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ నెల 6కు మేజర్ అయినట్లు తెలుస్తోంది. నిందితుడిని బుధవారం ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సీఐ మోహనరావు తెలిపారు. కాగా పోలీసులు గ్రామపెద్దలను విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment