కొడిగట్టిన కోటి ఆశలు
కాళ్లపారాణి ఆరకముందే... అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల మృతి
విషాదంలో సబ్బన్నపేట
ఆ నవవధువు కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. పెళ్లింటి గుమ్మాలకు కట్టిన తోరణాలు ఇంకా వాడిపోలేదు. కోటి ఆశలతో దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టిన నవవధువును రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు భర్త, తమ్ముడు, అత్తవారి కుటుంబసభ్యులతో వెళ్తున్న నవవధువు తన తమ్ముడితో సహా మృత్యువాత పడి కన్నవారికి, కట్టుకున్న వాడికి తీరని శోకాన్ని మిగిల్చింది. తన కుమార్తె, కుమారుడు మృత్యువాత పడ్డారన్న వార్త తెలుసుకున్న కన్నతండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదిస్తున్న అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
భోగాపురం: భోగాపురం మండలం గరినందిగాం పంచాయతీ సబ్బన్నపేట గ్రామానికి చెందిన ఉత్తాడ అప్పలరాములు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. అప్పలరాములు ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తె స్వాతి (22) డిగ్రీ చదువుకుంది. కొడుకు కల్యాణ్ (19)బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ఈనెల 2వ తేదీన విశాఖపట్నానికి చెందిన యువకుడికిచ్చి ఘనంగా వివాహం చేసి, చీర.సారెతో ఆనందంగా సాగనంపాడు. అయితే వియ్యాలవారు వధూవరులను తీసుకుని కుటుంబసభ్యులతో సహా తిరుపతి వెళ్తున్నాం, మీరూ రావాలని అప్పలరాములును కోరడంతో పనిఒత్తిడి కారణంగా తాను వెళ్లలేక భార్యలక్ష్మి, కొడుకు కల్యాణ్‌లను పంపించాడు.
నవ వధువు అయిన కుమార్తె స్వాతితో కుమారుడైన కల్యాణ్‌ను పంపించి తల్లి లక్ష్మి తాను ఇంటివద్దే ఉండిపోయింది. శనివారం రాత్రి కుటుంబసభ్యులు 14మంది వింగర్ వ్యాన్‌లో తిరుపతికి ప్రయాణమయ్యారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు- మేదరమెట్ల జాతీయ రహదారిపై వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాలట్యాంకర్‌ను వింగర్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిలో నవవధువు స్వాతి, ఆమె తమ్ముడు కల్యాణ్‌తోపాటు కుటుంబ సభ్యులు సింహాద్రి,
గోవిందమ్మ, ప్రసన్నకుమార్‌లు ఉన్నారు.
సబ్బన్నపేట గ్రామంలో ఉన్న తండ్రి అప్పలరాములుకి ప్రమాద వార్త తెలియగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తన రెండుకళ్లు అయిన కన్న పిల్లలు తనను వదిలి వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలికి దెబ్బతగిలి కట్టుకట్టించుకుని మంచంమీద ఉన్న అతను ఏడుస్తున్న తీరు చూపరుల మనసును కలిచివేసింది. తన అన్న పిల్లలను తన చేతులమీద పెంచానని వారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని మృతుల చిన్నాన్న నేలపై పడి పొర్లిపొర్లి ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు అందుబాటులో లేకపోవడంతో బాధితకుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించి వారికి అండగా ఉండమని పార్టీ కార్యకర్తలైన పోతిన రాంబాబు తదితరులకు సూచనలు అందజేశారు.