
ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరి గొంతు కోశారు
ఒంగోలు: ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో సోదరిని చంపేం దుకు అన్నలు ప్రయత్నించారు. ఈ దారుణం ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం జరిగింది. మద్దిపాడు మండలం రాచవారిపాలేనికి చెందిన కూచిపూడి ఇమ్మానియేలు(23), రాణి (21) ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇరువైపులా పెద్దలకు ఇష్టం లేదు. ఇద్దరూ ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాణి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ.
రాణి ప్రేమపెళ్లి చేసుకోవడం నచ్చని ఆమె సోదరులు రాము, భాస్కర్, రత్తయ్య కలసి బుధవారం ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవటంతో వారు పారిపోయారు. అప్పటికే ఆమె గొంతుపై బలమైన గాయం కాగా స్థానికులు రాణిని ఆస్పత్రికి తరలించారు.