తమ్ముళ్ల వీరంగం
నెల్లూరు (సెంట్రల్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. నగరంలో బుధవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో వారి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. తనది కాని వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు హల్‌చల్ చేశాడు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి, టీడీపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు వీరంగం సృష్టించాడు. స్థానిక 53,54వ డివిజన్లలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మభూమి నిర్వహించారు.
54వ డివిజన్‌లో జరిగిన జన్మభూమిలో 16వ డివిజన్ కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు పాల్గొన్నాడు. అంతేకాకుండా టీడీపీ చోటామోటా నాయకులు, కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు కలిసి ఎమ్మెల్యేతో గొడవకు దిగి నానా రభస సృష్టించారు. ఇదంతా పథకం ప్రకారమే చేసినట్టు స్థానికులు మండిపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ప్రసంగిస్తూ దివంగత నేత వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాల అమలు తీరును ప్రసంసిస్తుండగా కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు లేచి అడ్డు తగిలాడు.
మాట్లాడేందుకు వీల్లేదంటూ వాదనకు దిగాడు. నగర సమస్యపై మాట్లాడుతుంటే అడ్డుపడటం సమంజసం కాదని ఎంత నచ్చచెప్పినా అతను వినిపించుకోలేదు. ఎలాంటి పదవి లేని మరో టీడీపీ చోటా నేత ఆనం వెంకటరమణారెడ్డి స్టేజీపై కూర్చున్నాడు. ఆయన కూడా తమ నాయకులకు వంతపాడుతూ గొడవ పెంచేందుకు తన వంతు ఆజ్యం పోశాడు. పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు స్థానికులు టీడీపీ నేతల వైఖరిపై అసహనం ప్రదర్శిస్తూ వెనుదిరిగారు.
ఎమ్మెల్యేను అవమానపరచాలనే ఉద్దేశంతోనే గొడవ సృష్టించారని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజల తిరస్కారానికి గురైనా అధికారులపై పెత్తనం చెలాయించడం ఏం సంస్కారం అని పలువురు మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్ పాటించకపోయినా అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రొటోకాల్ పాటించేలా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.