► ఆర్భాటానికే పరిమితమైన ‘జన్మభూమి–మాఊరు’
► గ్రామ సభలకు నీళ్లలా నిధుల ఖర్చు..
► సమస్యల పరిష్కారం అంతంతమాత్రం
► ప్రజాధనంతో పార్టీ ప్రచారం
ఒంగోలు టౌన్: జన్మభూమి–మాఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. గ్రామసభలను ఆర్భాటంగా చేపట్టేందుకు నిధులను నీళ్లలా ఖర్చు చేస్తోంది. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే సొంత ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. మరి ఆస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయా..? అంటే ఆ ఒక్కటీ అడగొద్దంటూ ప్రభుత్వ పెద్దలు దాట వేస్తున్నారు. అధికారులు చూపుతున్న కాకిలెక్కల్లో వాస్తవిక ఏమిటో వారికే ఎరుక.
ఈ ఏడాది జనవరిలో జన్మభూమి–మాఊరు నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇందుకోసం రూ.96,84,000 ఖర్చు చేశారు. ప్రజల నుంచి లక్షకుపైగా దరఖాస్తులు రాగా అందులో 70వేల అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంటోం ది. వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు అర్జీలు తీసుకొని వాటిని సంబంధిత అధికారులకు పంపించడంతో వాటిని పరిష్కరించినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు.
ప్రభుత్వం వద్ద మంచి మార్కులు కొట్టేసి రాష్ట్రంలోనే అగ్రభాగంలో ఉన్నట్లు చూపేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గ్రామసభల్లో అర్జీలన్నీంటిని సంబంధిత శాఖలకు పంపించామా లేదా అన్నట్టుంది యంత్రాంగం వ్యవహారశైలి ఉంది. ఇదే విషయాన్ని అనేక మంది బాధితులు కూడా ధృవీకరిస్తున్నారు. జన్మభూమి సభల్లో తాము ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు పరిష్కరించలేదని అనేక మంది సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటం వాస్తవ పరిస్థితికి నిదర్శనం. పైగా వచ్చిన అర్జీల్లో అధిక భాగం రెవెన్యూ విభాగానికి చెందినవే. వాటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అధికారులకే తెలియాలి.
లెక్కలో వెనుకాడలేదు..
నాలుగో విడత జన్మభూమికి జిల్లాకు కేటాయించిన నిధుల ఖర్చు లెక్కలో మాత్రం యంత్రాంగం ఓ అడుగు ముందే ఉంది. మండలానికి రూ.35 వేలు, మునిసిపాలిటీకి రూ.35వేలు, గ్రామ పంచాయతీకి రూ.5వేల చొప్పు న కేటాయించారు. పదిరోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమలో ప్రతి హైర్ వెహికల్(బాడుగ వాహనం)కు రూ.15వేలు కేటాయించారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి రూ.75వేలు కేటాయించగా, కార్యాలయాల వాహనాలకు రూ.25వేల చొప్పున కేటాయించారు. అదర్ పేమెంట్ కింద మరో రూ.5వేలు కేటాయించారు. నిధులు వరదలా ఖర్చు చేసినప్పటికీ సమస్యలు మాత్రం పిల్ల కాలువలో నీరులా కూడా పారకపోవడం గమనార్హం.