janmabhoomi-maa ooru
-
ఆ ఒక్కటీ అడక్కు!
► ఆర్భాటానికే పరిమితమైన ‘జన్మభూమి–మాఊరు’ ► గ్రామ సభలకు నీళ్లలా నిధుల ఖర్చు.. ► సమస్యల పరిష్కారం అంతంతమాత్రం ► ప్రజాధనంతో పార్టీ ప్రచారం ఒంగోలు టౌన్: జన్మభూమి–మాఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. గ్రామసభలను ఆర్భాటంగా చేపట్టేందుకు నిధులను నీళ్లలా ఖర్చు చేస్తోంది. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే సొంత ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. మరి ఆస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయా..? అంటే ఆ ఒక్కటీ అడగొద్దంటూ ప్రభుత్వ పెద్దలు దాట వేస్తున్నారు. అధికారులు చూపుతున్న కాకిలెక్కల్లో వాస్తవిక ఏమిటో వారికే ఎరుక. ఈ ఏడాది జనవరిలో జన్మభూమి–మాఊరు నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇందుకోసం రూ.96,84,000 ఖర్చు చేశారు. ప్రజల నుంచి లక్షకుపైగా దరఖాస్తులు రాగా అందులో 70వేల అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంటోం ది. వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు అర్జీలు తీసుకొని వాటిని సంబంధిత అధికారులకు పంపించడంతో వాటిని పరిష్కరించినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం వద్ద మంచి మార్కులు కొట్టేసి రాష్ట్రంలోనే అగ్రభాగంలో ఉన్నట్లు చూపేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గ్రామసభల్లో అర్జీలన్నీంటిని సంబంధిత శాఖలకు పంపించామా లేదా అన్నట్టుంది యంత్రాంగం వ్యవహారశైలి ఉంది. ఇదే విషయాన్ని అనేక మంది బాధితులు కూడా ధృవీకరిస్తున్నారు. జన్మభూమి సభల్లో తాము ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు పరిష్కరించలేదని అనేక మంది సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటం వాస్తవ పరిస్థితికి నిదర్శనం. పైగా వచ్చిన అర్జీల్లో అధిక భాగం రెవెన్యూ విభాగానికి చెందినవే. వాటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అధికారులకే తెలియాలి. లెక్కలో వెనుకాడలేదు.. నాలుగో విడత జన్మభూమికి జిల్లాకు కేటాయించిన నిధుల ఖర్చు లెక్కలో మాత్రం యంత్రాంగం ఓ అడుగు ముందే ఉంది. మండలానికి రూ.35 వేలు, మునిసిపాలిటీకి రూ.35వేలు, గ్రామ పంచాయతీకి రూ.5వేల చొప్పు న కేటాయించారు. పదిరోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమలో ప్రతి హైర్ వెహికల్(బాడుగ వాహనం)కు రూ.15వేలు కేటాయించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి రూ.75వేలు కేటాయించగా, కార్యాలయాల వాహనాలకు రూ.25వేల చొప్పున కేటాయించారు. అదర్ పేమెంట్ కింద మరో రూ.5వేలు కేటాయించారు. నిధులు వరదలా ఖర్చు చేసినప్పటికీ సమస్యలు మాత్రం పిల్ల కాలువలో నీరులా కూడా పారకపోవడం గమనార్హం. -
నేడు జిల్లాకు చంద్రబాబు
హుసేనాపురంలో జన్మభూమి-మా ఊరు సాక్షి, కర్నూలు: జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో పర్యటించనున్నారు. ఇందుకోసం హుసేనాపురం-కాల్వ గ్రామాల మధ్య హెలిపాడ్‌ను సిద్ధం చేశారు. హుసేనాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బనగానపల్లె మండలంలోని పసుపుల గ్రామంలో సీఎం పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దయింది. ఇదిలాఉంటే సోమవారం నాటి సీఎం పర్యటన భారమంతా పొదుపు సంఘాలపైనా మోపడం గమనార్హం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించి ఒక్కో శాఖకు, ఒక్కో బాధ్యతను అప్పగించారు. అవసరమైన వాహనాలు, పొదుపు మహిళల తరలింపు బాధ్యత కూడా వారి భుజస్కందాలకే ఎత్తారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళా రుణమాఫీ.. ఇలా ఎన్నెన్నో హామీలను విస్మరించిన సీఎం పట్ల అసంతృప్తితో ఉన్న జనాన్ని మెప్పించి జనాన్ని కార్యక్రమానికి తరలించడం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. భారీ బందోబస్తు ప్రభుత్వం పట్ల తీవ్ర అంసతృప్తితో ఉన్న ప్రజలు ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయకుండా భారీ పోలీసు బందోబస్తుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 44 మంది ఎస్ఐలు, 117 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 350 కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 284 మంది హోంగార్డులు, 7 పార్టీల సాయుధ దళాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఏర్పాట్ల పరిశీలన హుసేనాపురం(ఓర్వకల్లు): జన్మభూమా-మా ఊరు కార్యక్రమంలో భాగంగా సోమవారం హుసేనాపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎస్పీ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ మనోహర్‌రావు, టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, డీపీవో శోభా స్వరూపరాణి, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ నజీర్అహ్మద్, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్, డ్వామా పీడీ ఠాగూర్‌నాయక్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరణలో భాగంగా స్థానిక ఎలిమెంటరీ పాఠశాల, పశువైద్యశాల పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దాదాపు 8వేల మంది పొదుపు మహిళలను తరలించేందుకు 130 ఆర్టిసీ బస్సులను సిద్ధం చేశారు. ఏర్పాట్ల పరిశీలనలో అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీవో రఘుబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, ఏపీడీ లక్ష్మన్న, హార్టికల్చర్ ఏడీలు సతీష్, ఎస్.ఇస్మాయిల్, సాజేనాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఇలా... సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.30 గంటలకు ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం-కాల్వ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. 11.40 గంటలకు హుస్సేనాపురంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శిస్తారు. 11.55 గంటలకు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా శనగ, పత్తి, చెరకు పంటలను పరిశీలిస్తారు. రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘చెట్టు-పట్టా’ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి. మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం, ఫాంపాండ్స్ పరిశీలన. మధ్యాహ్నం 12.45 గంటలకు ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఆరోగ్య శిబిరాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 గంటల వరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి. 1.45 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి. 2.35 నుంచి 4.45 గంటల వరకు హుస్సేనాపురంలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, వాటి అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. పేదరికంపై విజయం అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా బలపడిన పొదుపు మహిళలతో సమీక్ష సమావేశం. 4.45 గంటలకు హుస్సేనాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 5.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. -
తమ్ముళ్ల వీరంగం
నెల్లూరు (సెంట్రల్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. నగరంలో బుధవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో వారి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. తనది కాని వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు హల్చల్ చేశాడు. వైఎస్సార్సీపీ తరపున గెలిచి, టీడీపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు వీరంగం సృష్టించాడు. స్థానిక 53,54వ డివిజన్లలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మభూమి నిర్వహించారు. 54వ డివిజన్లో జరిగిన జన్మభూమిలో 16వ డివిజన్ కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు పాల్గొన్నాడు. అంతేకాకుండా టీడీపీ చోటామోటా నాయకులు, కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు కలిసి ఎమ్మెల్యేతో గొడవకు దిగి నానా రభస సృష్టించారు. ఇదంతా పథకం ప్రకారమే చేసినట్టు స్థానికులు మండిపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ప్రసంగిస్తూ దివంగత నేత వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాల అమలు తీరును ప్రసంసిస్తుండగా కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు లేచి అడ్డు తగిలాడు. మాట్లాడేందుకు వీల్లేదంటూ వాదనకు దిగాడు. నగర సమస్యపై మాట్లాడుతుంటే అడ్డుపడటం సమంజసం కాదని ఎంత నచ్చచెప్పినా అతను వినిపించుకోలేదు. ఎలాంటి పదవి లేని మరో టీడీపీ చోటా నేత ఆనం వెంకటరమణారెడ్డి స్టేజీపై కూర్చున్నాడు. ఆయన కూడా తమ నాయకులకు వంతపాడుతూ గొడవ పెంచేందుకు తన వంతు ఆజ్యం పోశాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు స్థానికులు టీడీపీ నేతల వైఖరిపై అసహనం ప్రదర్శిస్తూ వెనుదిరిగారు. ఎమ్మెల్యేను అవమానపరచాలనే ఉద్దేశంతోనే గొడవ సృష్టించారని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజల తిరస్కారానికి గురైనా అధికారులపై పెత్తనం చెలాయించడం ఏం సంస్కారం అని పలువురు మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్ పాటించకపోయినా అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రొటోకాల్ పాటించేలా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
షేమ్.. షేమ్..!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాప్రతినిధులచే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ భాగం. తద్భిన్నంగా తెలుగుతమ్ముళ్లు నడుచుకుంటున్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కేయడంలో ముందు వరసలో నిలుస్తున్నారు. నిలవరించాల్సిన అధికార యంత్రాంగం వారికి వత్తాసుగా నిలుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన నాయకులను కాదని పచ్చచొక్కాదారులకు పెద్దపీట వేస్తోంది. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ బహిరంగసభలా వేదిక కన్పిస్తోంది. గ్రామంలో సర్పంచ్, వార్డులో కౌన్సిలర్, డివిజన్లో కార్పొరేటర్ మొదటి పౌరుడు. ఆవిషయం అటు ప్రజలకు, ఇటు అధికారులకు తెలిసిందే. స్థానిక ప్రజాప్రతినిధి నేతృత్వంలోనే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగానికి ఇవేవీ పట్టడం లేదు. అధికారపార్టీ నేతల మెప్పుకోసం పనిచేస్తే చాలన్నట్లుగా మసులుకుంటోంది. ‘జన్మభూమి- మాఊరు’ ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సభలా నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలను వేధికలపైకి ఎక్కించి స్థానిక ప్రజాప్రతినిధుల్ని విస్మరిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు పర్యటిస్తే ఎమ్మెల్యేలను సైతం దూరం పెడుతున్నారు. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా.... జన్మభూమిలో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా యంత్రాంగం వివక్షత ప్రదర్శిస్తోంది. జిల్లా కేంద్రమైన కడప గడపలో ఈ దోరణి అధికంగా కన్పిస్తోంది. 1వ డివిజన్లో స్థానిక కార్పోరేటర్‌ను విస్మరించి తెలుగుదేశం పార్టీ నేతలు స్టేజీపై తిష్ట వేశారు. అదే పరిస్థితి పలు డివిజన్లలో కన్పించింది. ప్రజాప్రతినిధులచే కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అవేవీ పాటించకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. పింఛన్ల పంపిణీకి తామే అర్హులమని ఆపార్టీ నేతలు భావిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేని కాదని తెలుగుతమ్ముళ్లు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం... ఆశ్రీత పక్షపాతానికి తావు లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడకుండా వివక్షత ప్రదర్శిస్తున్నారు. మంత్రి హోదాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం సమాచారం లేకుండా జన్మభూమి నిర్వహిస్తున్నారు. ఇందుకు రాయచోటి జన్మభూమి కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం లేకుండానే అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెలేలు, ఎంపీలకు సమాచారం లేకుండా నిర్వహించరాదని వివరించారు. రాజ్యాంగ విలువలకు అధికారం యంత్రాంగం తిలోదాలు ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఎంతైనా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.