నేడు జిల్లాకు చంద్రబాబు
హుసేనాపురంలో జన్మభూమి-మా ఊరు
సాక్షి, కర్నూలు:
జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో పర్యటించనున్నారు. ఇందుకోసం హుసేనాపురం-కాల్వ గ్రామాల మధ్య హెలిపాడ్‌ను సిద్ధం చేశారు. హుసేనాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బనగానపల్లె మండలంలోని పసుపుల గ్రామంలో సీఎం పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దయింది.
ఇదిలాఉంటే సోమవారం నాటి సీఎం పర్యటన భారమంతా పొదుపు సంఘాలపైనా మోపడం గమనార్హం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించి ఒక్కో శాఖకు, ఒక్కో బాధ్యతను అప్పగించారు. అవసరమైన వాహనాలు, పొదుపు మహిళల తరలింపు బాధ్యత కూడా వారి భుజస్కందాలకే ఎత్తారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళా రుణమాఫీ.. ఇలా ఎన్నెన్నో హామీలను విస్మరించిన సీఎం పట్ల అసంతృప్తితో ఉన్న జనాన్ని మెప్పించి జనాన్ని కార్యక్రమానికి తరలించడం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది.
భారీ బందోబస్తు
ప్రభుత్వం పట్ల తీవ్ర అంసతృప్తితో ఉన్న ప్రజలు ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయకుండా భారీ పోలీసు బందోబస్తుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 44 మంది ఎస్‌ఐలు, 117 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 350 కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 284 మంది హోంగార్డులు, 7 పార్టీల సాయుధ దళాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
హుసేనాపురం(ఓర్వకల్లు): జన్మభూమా-మా ఊరు కార్యక్రమంలో భాగంగా సోమవారం హుసేనాపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎస్పీ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ మనోహర్‌రావు, టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, డీపీవో శోభా స్వరూపరాణి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ నజీర్‌అహ్మద్, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్, డ్వామా పీడీ ఠాగూర్‌నాయక్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరణలో భాగంగా స్థానిక ఎలిమెంటరీ పాఠశాల, పశువైద్యశాల పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.
మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దాదాపు 8వేల మంది పొదుపు మహిళలను తరలించేందుకు 130 ఆర్టిసీ బస్సులను సిద్ధం చేశారు. ఏర్పాట్ల పరిశీలనలో అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీవో రఘుబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, ఏపీడీ లక్ష్మన్న, హార్టికల్చర్ ఏడీలు సతీష్, ఎస్.ఇస్మాయిల్, సాజేనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాలు ఇలా...
సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.30 గంటలకు ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం-కాల్వ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
11.40 గంటలకు హుస్సేనాపురంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శిస్తారు.
11.55 గంటలకు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా శనగ, పత్తి, చెరకు పంటలను పరిశీలిస్తారు. రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘చెట్టు-పట్టా’ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి.
మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం, ఫాంపాండ్స్ పరిశీలన.
మధ్యాహ్నం 12.45 గంటలకు ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1 గంటకు ఆరోగ్య శిబిరాన్ని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 గంటల వరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి.
1.45 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి.
2.35 నుంచి 4.45 గంటల వరకు హుస్సేనాపురంలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, వాటి అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. పేదరికంపై విజయం అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా బలపడిన పొదుపు మహిళలతో సమీక్ష సమావేశం.
4.45 గంటలకు హుస్సేనాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 5.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.