షేమ్.. షేమ్..! | Shame .. Shame ..! | Sakshi
Sakshi News home page

షేమ్.. షేమ్..!

Published Mon, Oct 6 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

Shame .. Shame ..!

సాక్షి ప్రతినిధి, కడప:
 ప్రజాప్రతినిధులచే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ భాగం. తద్భిన్నంగా తెలుగుతమ్ముళ్లు నడుచుకుంటున్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కేయడంలో ముందు వరసలో నిలుస్తున్నారు. నిలవరించాల్సిన అధికార యంత్రాంగం వారికి వత్తాసుగా నిలుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన నాయకులను  కాదని  పచ్చచొక్కాదారులకు పెద్దపీట వేస్తోంది. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమం  అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ బహిరంగసభలా వేదిక కన్పిస్తోంది. గ్రామంలో సర్పంచ్, వార్డులో కౌన్సిలర్, డివిజన్‌లో కార్పొరేటర్ మొదటి పౌరుడు. ఆవిషయం అటు ప్రజలకు, ఇటు అధికారులకు తెలిసిందే. స్థానిక ప్రజాప్రతినిధి నేతృత్వంలోనే  ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగానికి ఇవేవీ పట్టడం లేదు. అధికారపార్టీ నేతల  మెప్పుకోసం పనిచేస్తే చాలన్నట్లుగా మసులుకుంటోంది. ‘జన్మభూమి- మాఊరు’ ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సభలా నిర్వహిస్తోంది.  తెలుగుదేశం పార్టీ నేతలను  వేధికలపైకి ఎక్కించి స్థానిక ప్రజాప్రతినిధుల్ని విస్మరిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు పర్యటిస్తే ఎమ్మెల్యేలను  సైతం దూరం పెడుతున్నారు.
 
 కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా....
 జన్మభూమిలో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా యంత్రాంగం వివక్షత ప్రదర్శిస్తోంది. జిల్లా కేంద్రమైన కడప గడపలో ఈ దోరణి అధికంగా కన్పిస్తోంది. 1వ డివిజన్‌లో స్థానిక కార్పోరేటర్‌ను విస్మరించి తెలుగుదేశం పార్టీ నేతలు స్టేజీపై తిష్ట వేశారు. అదే పరిస్థితి పలు డివిజన్లలో  కన్పించింది. ప్రజాప్రతినిధులచే కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది.

 అవేవీ పాటించకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది..  పింఛన్ల  పంపిణీకి తామే అర్హులమని ఆపార్టీ నేతలు భావిస్తున్నారని  పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేని కాదని తెలుగుతమ్ముళ్లు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు.

 రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం...
 ఆశ్రీత పక్షపాతానికి తావు లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణ స్వీకారం  చేసిన  మంత్రులు సైతం తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడకుండా వివక్షత  ప్రదర్శిస్తున్నారు.  మంత్రి హోదాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం సమాచారం లేకుండా జన్మభూమి  నిర్వహిస్తున్నారు. ఇందుకు రాయచోటి జన్మభూమి కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం లేకుండానే అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెలేలు, ఎంపీలకు సమాచారం లేకుండా నిర్వహించరాదని వివరించారు.  రాజ్యాంగ విలువలకు అధికారం యంత్రాంగం తిలోదాలు ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఎంతైనా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement