ఆగడాలు చాలిక
- సీఎం సూచన మేరకు దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలు
- పోలీసు యంత్రాంగం గాంధారి పాత్ర పోషిస్తోంది
- పుట్లూరు మండలం ఎల్లుట్లలో కార్యకర్త
- దారుణ హత్యపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఆగ్రహం
అనంతపురం మెడికల్ : ‘అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయి. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలనే కుటిల రాజకీయంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యలు, దాడులకు టీడీపీ శ్రేణులు తెగబడుతున్నాయి. ఒకవైపు టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం గాంధారి ప్రాత పోషిస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు.
శుక్రవారం పుట్లూరు మండలం ఎల్లుట్లలో టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లికార్జున మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, శింగనమల నియోజవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి ఆస్పత్రి వద్దకు వచ్చి బంధువులను పరామర్శించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద ఉన్న డీఎస్పీ నాగరాజును దాడుల విషయంపై గురునాథరెడ్డి నిలదీశారు.
కక్షలకు జేసీ సోదరుల ఆజ్యం
పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆధిపత్యం కోసం జేసీ సోదరులు కక్షలకు ఆజ్యం పోస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొలుపుతున్నారు. జిల్లాలో టీడీపీ ఆగడాలు, దౌర్జనం మితిమీరాయి. ఆ పార్టీ దౌర్జన్యాలపై ఎస్పీకి విన్నవించి 24 గంటలు కూడా గడవకముందే ఎల్లుట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హత్య చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో పదవీ కాంక్ష మితిమీరింది. ప్రధానంగా పూట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆధిపత్యం కోసం జేసీ సోదరులు గ్రామాల్లో కక్షలకు తెరలేపారు. వీరిపై ప్రజలు తిరబడే రోజు వస్తుంది. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులను ఆపకపోతే ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుంటాం.
- శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్ర
తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరాయి. చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. 1994 నుంచి 2004 వరకు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. మరోమారు అదే చరిత్ర పునరావృతం అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదనే ఆలోచనతో ఇదంతా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ప్రధానంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, ఆర్థిక మూలాలను దెబ్బ తీయడం అందులో భాగమే. చౌక దుకాణం కోసం దాడులు చేస్తున్నారు. వీటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్యకర్తలకు అండగా ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపడతాం.
- అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ
తెగబడి దాడులు చేస్తున్నారు
గ్రామ స్థాయిలో కక్షలకు తెలుగుదేశం పార్టీ ఆజ్యం పోస్తోంది. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెగబడి దాడులు చేస్తున్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం అచేతనంగా ఉండిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి చేసినా మిన్నకుండిపోవాలని, కేసులు బనాయించవద్దని పోలీసులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఆ కారణంగానే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు పేట్రేగి పోతున్నారు. ఇకపై కూడా ఇదే విధానం కొనసాగితే ప్రత్యక్ష ఆందోళన చేపడతాం.
- గురునాథరెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే
రాజకీయ హత్యలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండు నెలల వ్యవధిలో శింగనమల నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగాయి. ఇవి రెండూ రాజకీయ హత్యలే. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తే జీవితాలు దుర్భరంగా తయారవుతాయి.