కంకర, రాళ్లు తేలిన పెద్దపాడు– లక్ష్మీపురం రోడ్డు
అధ్వానంగా కనిపిస్తున్న ఈరోడ్డు పెద్దపాడు నుంచి లక్ష్మీపురంకెళ్లే దారి. 4.10 కి.మీ. దూరం గల ఈ రోడ్డుకు రూ. 2.67 కోట్లు ఖర్చు చేశారు. పట్టుమని మూడేళ్లు కూడా పూర్తికాక ముందే కంకర, రాళ్లు తేలి శిథిలమైంది. హైదరాబాద్‌కు చెందిన ఈశ్వర్‌రెడ్డి అండ్ కంపెనీ కాంట్రాక్టర్ ఈ పనులు చేపట్టారు. పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ రాజ్ అధికారులు ఆ సమయంలో ఎక్కడున్నారో తెలియదు కానీ సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం నాణ్యతకు నీళ్లొదిలారు. తద్వారా కోట్ల రూపాయలు మింగేశారనే విమర్శలున్నాయి.
కర్నూలు, కల్లూరు (రూరల్): ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం కల్లూరు మండలం పరిధిలోని లక్ష్మీపురం – పెద్దపాడుకు 2015లో రూ. 2.67 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేసింది. 4.10 కిలో మీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు పనులను ఈశ్వర్‌రెడ్డి అండ్ కంపెనీ దక్కించుకుంది. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఫలితంగా మూడేళ్లకే తారు పెచ్చులూడి కంకర, రాళ్లు తేలాయి. ప్రస్తుతం ఈ రోడ్డులో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు అదుపుతప్పి కిందపడుతున్నాయి. ఇంత అధ్వానంగా బీటీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌కు పంచాయతీరాజ్ అధికారులు నిధులు ఏ విధంగా విడుదల చేశారో నిఘా వర్గాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
పత్తాలేని నిర్వహణ: బీటీ రోడ్డు నిర్వహణను సదరు కాంట్రాక్టర్ గాలికొదిలేశారు. రోడ్డు దెబ్బతినకుండా చూసుకోవాలని, డ్యామేజ్ అయితే మరమ్మతులు చేయాలని 2015–16లో రూ.1.52 లక్షలు, 2016–17లో రూ.1.88 లక్షలు, 2017–18 రూ.2.28 లక్షలు, 2018–19 సంవత్సరంలో రూ.2.65 లక్షలు, 2019–20 సంవత్సరంలో రూ.3.3 లక్షల చొప్పున ఐదేళ్లలో రూ.11.39 లక్షలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మూడో సంవత్సరం నుంచే బీటీ రోడ్డు అడ్రస్ లేకుండా పోయింది. నిర్వహణ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్లు దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై కూడా నిఘా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
రోడ్డు శిథిలమైంది
పెద్దపాడు మీదుగా లక్ష్మీపురం వెళ్లే బీటీ రోడ్డు కిలో మీటర్ మేర పూర్తిగా శిథిలమై కంకర తేలడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పుతున్నాయి. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. బీటీ రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలి.అమృతరాజు, పెద్దపాడు గ్రామం
Comments
Please login to add a commentAdd a comment