తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా వారి కష్టానికి తగినట్లుగా మంచి మార్కులు సాధించలేకపోతున్నానని ...
విద్యానగర్ (గుంటూరు) : తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా వారి కష్టానికి తగినట్లుగా మంచి మార్కులు సాధించలేకపోతున్నానని మనస్తాపానికి గురై బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి అవుట్‌పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనివాసరావుతోట 10వ లైనుకు చెందిన ఎన్.నరసింహారావు, భూలక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు.
వీరికి ఒక కుమారుడు ఉమామహేశ్వరరావు(22), కుమార్తె ప్రసన్నకుమారి ఉన్నారు. ఉమామహేశ్వరరావు గుంటూరు రూరల్ మండలంలోని చౌడవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతుండగా, ప్రసన్నకుమారి నగరంలో ఇంటర్‌మీడియట్ చదువుతోంది. తల్లిదండ్రులు కూలినాలీ చేసి చదివిస్తున్నా తనకు చదువు అబ్బడం లేదని, అదేవిధంగా చదవాలనే కోరిక కలగడం లేదని దాని ద్వారా మంచి మార్కులు సాధించలేకపోతున్నానని మనస్తాపంతో ఉమామహేశ్వరరావు ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన మరణానికి ఎవరూ కారణం కాదని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నెరవేర్చలేకపోతున్నాననే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లెటర్ రాసి మంచంపై ఉంచాడని ఉమామహేశ్వరరావు తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. సంఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అవుట్‌పోస్టు సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.