మెట్ట రైతు నోట మట్టేనా | Budget announces new irrigation scheme for growers | Sakshi
Sakshi News home page

మెట్ట రైతు నోట మట్టేనా

Published Thu, Jan 29 2015 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

మెట్ట రైతు నోట మట్టేనా

మెట్ట రైతు నోట మట్టేనా

 పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అమిత శ్రద్ధ
 చింతలపూడి, తాడిపూడి పథకాలపై మాత్రం అశ్రద్ధ
 ఆ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోని సర్కారు
 సకాలంలో పూర్తిచేస్తే 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పొరుగు జిల్లాలకు గోదావరి నీటిని తరలించాలని ఉవ్విళ్లూరుతున్న పాలకులు జిల్లాలో మెట్ట రైతులకు ఉపయోగపడే చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను మాత్రం కనీస మాత్రమైనా పట్టించుకోవడం లేదు. సాగునీటి సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్న మెట్ట ప్రాంతంలోని 16 మండలాల పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే చింతలపూడి ఎత్తిపోతలు, మరో 60 వేల ఎకరాలకు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల నిర్మాణాలను పూర్తిచేసే విషయంలో చంద్రబాబు సర్కారు ఇప్పటివరకు నోరుమెదపలేదు. గడచిన 8 నెలల కాలంలో ఐదుసార్లు జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ఆ రెండు పథకాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. జిల్లా మంత్రులు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం ఈ పథకాల ఊసే ఎత్తడం లేదు.
 
 చింతలపూడిపై చిన్నచూపు
 జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 16 మండలాల పరిధిలోని 196 గ్రామాల్లో పంటలకు సాగునీరు అందించేందుకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2013 ఫిబ్రవరి నాటికి (నాలుగేళ్ల కాలవ్యవధి) పనులు పూర్తి కావాల్సినప్పటికీ ఇప్పటివరకు 18 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మహానేత హఠాన్మరణం తర్వాత పనులు పూర్తిగా పడకేశాయి.  గడువు ముగియడంతో  పథకం పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు (2016 ఫిబ్రవరి వరకు) పొడిగించారు. ఈ పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. మొదటి ప్యాకేజీలో 1, 2, 3, పంప్ హౌస్‌లు, 0 కిలోమీటర్ల నుంచి 36 కిలోమీటర్ల వరకు ప్రధా న కాలువ పనులు, 13 కిలోమీటర్ల దూరం లీడింగ్  ఛానల్ పనులు, జల్లేరు రిజర్వాయర్ పటిష్టత పనులు చేపట్టాల్సి ఉంది.
 
 ప్యాకేజీ మొత్తం పనులను ఆరేళ్ల కాలంలో కేవలం  25 శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు. నిర్మాణ పనులకు 18,208 ఎకరాల భూమిని సేకరిం చాల్సి ఉండగా, ఇందులో 6,683 ఎకరాల అట వీ భూమి ఉంది. మిగతా భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, దీనిలో కేవలం 1,135 ఎకరాలు మాత్రమే సేకరించారు. రెండో ప్యాకేజీలో ప్రధాన కాలువ 36వ కిలోమీటరు నుంచి 68వ కిలోమీటరు వరకు చేపట్టాల్సి ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి 6,801 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, దీనిలో 634 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇంకా 6,167 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నప్పటికీ కేవలం 133 ఎకరాలు భూమి మాత్రమే సేకరించారు. ఈ ప్యాకేజీ కింద ఇప్పటివరకు 3 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 97 శాతం పనులు పూర్తి చేయడమనేది అసాధ్యమేనని ఎవరైనా చెబుతారు.
 
 తాడిపూడి ఆయక ట్టంతా తడిసేదెప్పుడు?
 మెట్టలోని 14 మండల పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో  2 లక్షల 6వేల 600 ఎకరాలకు సాగునీరందించేందుకు తాడిపూడి పథకాన్ని రూపొం దించారు. 2007 సెప్టెంబర్ 25న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూసేకరణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేటికీ ఈ పథకం ద్వారా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి నెలకొంది. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం పూర్తి కావడానికి 5,248 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 4,494 ఎకరాలు సేకరించారు. భూ సేకరణ పూర్తికాకపోవడంతో 53 వేల ఎకరాలకు పైగా నీరందడం లేదు. దేవరపల్లి సమీపంలో అదనంగా నిర్మిస్తున్న ఐదో లిఫ్ట్ పనులు పూర్తికాలేదు. దీనివల్ల మరో 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదు. తాడిపూడి పథకం పనులు పూర్తయితే మరో 66వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 2,06,600 ఎకరాలకు నీరందించాల్సిన పథకం ద్వారా లక్షన్నర ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పదే పదే జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు ఒక్కసారైనా చింతలపూడి, తాడిపూడి పథకాల పనుల తీరును స్వయంగా పరిశీలిస్తే వేగవంతం అయ్యే అవకాశం ఉందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. నత్తతో పోటీపడుతున్న ఈ పథకాలను పూర్తి చే యించడంలో శ్రద్ధ కనబరచని ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని హడావుడిగా తలకెత్తుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement