
నవరత్నాల పథకాల గురించి వివరిస్తున్న పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బేతంచెర్ల: ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామంలో శనివారం.. నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారన్నారు.
వైఎస్సార్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అందికాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు సైతం రూ. 5లక్షల చొప్పున అమ్ముకున్న ఘన చరిత్ర అధికార పార్టీ నాయకులకు దక్కుతుందన్నారు. గ్రాఫిక్స్, బొమ్మలకు మాత్రమే రాజధాని పరిమితమైందని ఎద్దేవా చేశారు.
నీటి ప్రాజెక్టులు, రాజధాని భూముల పేరుతో వేల కోట్ల రూపాయ లు టీడీపీ నేతలు దిగమింగారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాల చిట్టా చూసి..హరికథ చెప్పే వారు కూడా భయపడి పారిపోతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హమీలు అమలు చేయకుండా అధికారం కోసం మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని, మరోసారి మోసపోవద్దని సూచించారు. పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, మురళీకృష్ణ, రామచంద్రుడు, వెంకటరెడ్డి, నాగముని రెడ్డి, వెంగళ్ రెడ్డి, స్వామి రెడ్డి, నరసింహులు, ముద్దుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment