
వడపోత
బాబు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారా.. ఆయన ప్రకటించినట్టు పెరిగే పెన్షన్ ఎప్పుడు అందుతుందా... అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ భారం ఎలా తగ్గించాలా... కొందరినైనా అనర్హులుగా ప్రకటించేందుకు ఏం చేయాలా అని అధికారులు యోచిస్తున్నారు. ఇదివరకే దీనికోసం ఓ సాఫ్ట్‌వేర్ రూపొందిం చారనీ... బోగస్ పింఛన్ల పేరుతో కొన్నింటినైనా తగ్గించేస్తారనీ వారికి తెలియదు పాపం.
సాక్షి, గుంటూరు: కొత్త ప్రభుత్వానికి భారంగా మారనున్న పింఛన్లలో కోత పడబోతోందా... వడపోతకోసం ఇదివరకే రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇప్పుడు ఉపయోగించనున్నారా... ఎన్నికల్లో విపరీతమైన హామీలిచ్చేసిన కొత్త ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రత్యేక విధి విధానాలకు ఆదేశాలు ఇవ్వనుందా?.. ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఇప్పటికే రేషన్ కార్డు, ఆధార్ సీడింగ్‌తో వడపోతకు ముమ్మర యత్నాలు చేస్తోంది.
ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టినా.. వరుస ఎన్నికలు రావడంతో ఎంపీడీవోలు ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాలకు వెళ్ళడంతో అప్పట్లో అది నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత పింఛన్లను రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచుతామని ప్రకటించారు. వికలాంగుల పెన్షన్లు రూ.1,500 వరకు ఇస్తామని హామీనిచ్చారు. అయితే ఈ భారం మోయడం ఒకవిధంగా సర్కారుకు సవాలే. గత సర్కారు హయాంలోనే తెల్ల రేషన్ కార్డుల్లో తప్పులు, ఆధార్ సీడింగ్‌తో సరిపోల్చి సామాజిక పింఛన్లు నిలుపుదలకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి వడపోతకు శ్రీకారం చుట్టారు. తెల్లకార్డు ఉన్నవారు, లేనివారు ఎంతమంది పింఛన్లు పొందుతున్నారో.. వారి వివరాలు సేకరించారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలపై, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎంపీడీవోలు ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాలకు వెళ్ళడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఎంపీడీవోలను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించడంతో వారు విధుల్లో చేరగానే మొదటి ప్రాధాన్యతగా పింఛన్ల వడపోతపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
కొత్త సర్కారుకు జిల్లాలో
పింఛన్ల భారం రూ. 11కోట్ల పైమాటే...
జిల్లాలో మొత్తం 3,59,445 సామాజిక పింఛనర్లు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.9.14 కోట్లు చెల్లిస్తున్నారు. జిల్లాలోని 57 మండలాల్లో 96,212 మంది ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. ఇందుకు రూ. 1.92 కోట్లు ఖర్చు అవుతోంది. బాబు ఎన్నికల హామీ అమలు చేస్తే రూ.9.62 కోట్లు అవసరం. అంటే రూ.7.7 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్న మాట. వికలాంగ పింఛన్లు జిల్లాలో 42,022 మందికి అందిస్తున్నారు. పింఛన్ రూ.500 ప్రకారం వీరికి ప్రతి నెలా రూ.2.10 కోట్లే. పెరిగే పింఛన్ సొమ్ము ప్రకారం రూ.1,500 అందిస్తే రూ. 6.30 కోట్లు అవసరమవుతాయి.
అంటే అదనంగా రూ.4.2 కోట్లు భారం పడుతుందన్న మాట. ఈ లెక్కన వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల భారమే రూ.11.9 కోట్ల వరకు ఉంది. గతంలో జిల్లా మొత్తం పింఛన్లకు రూ.9.14 కోట్లు అయితే, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల వరకే పెరిగే భారం రూ.11 కోట్లుకు పైగా కావడంతో ఈ భారం తగ్గించుకునేందుకు ఉన్నత స్థాయిలో తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారు. పెంచనున్న పింఛను మొత్తాలు ఎప్పుడు అందిస్తారా? అని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు పింఛన్ల ఫైలుపై సంతకం చేస్తారా? అని లబ్ధిదారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంతవరకు అధికారులకు ఈ విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.