- సెల్‌టవర్ల ముసుగులో అవినీతి బిజినెస్
- ‘చక్రం’తిప్పిన అధికారి
- మున్సిపల్ కమిషనర్‌కు మరో మస్కా
- ఏసీబీ తనిఖీలతో టెన్షన్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో బదిలీ అయిన అధికారులకు బాండ్ల ‘బ్యాండ్’ పడింది. బాండ్ల జారీలో జరిగిన కిరికిరిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి స్పష్టమైన ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ పరిణామాలతో టౌన్‌ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసి బదిలీ అయిన ముఖ్య అధికారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
అవినీతి డొంక కదిలింది..
ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ బాండ్స్ ఇప్పిస్తామంటూ భారీగా కలెక్షన్లు చేశారు. సెల్‌టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కమిషనర్‌కు మస్కా కొట్టి ఫైల్‌పై సంతకాలు చేయించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల్లోని ముగ్గురు అధికారులు మెగా బిజినెస్ చేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌లోని అధికారులు ఇద్దరు బదిలీ అవుతున్న సందర్భంగా బాండ్లు ఇస్తామంటూ స్థల యజమానుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడ్డారు. వీరి మాయలోపడి లక్షలు సమర్పించుకున్న స్థల యజమానులు న్యాయం చేయాలంటూ మేయర్ కోనేరు శ్రీధర్‌ను ఆశ్రయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రోడ్ల విస్తరణ, నగరపాలక సంస్థ అవసరాల దృష్ట్యా ప్రైవేటు స్థలాలను సేకరిస్తే ఆస్థానే నష్టపరిహారంగా ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ బాండ్లను టౌన్‌ప్లానింగ్ విభాగం జారీ చేస్తుంది. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు బాండ్లు జారీ చేయకుండా, అడ్డదారిలో అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తోంది. బదిలీ అయిన ముఖ్య అధికారి, టీపీఎస్ సర్వం తామై వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. బాండ్ల జారీపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
చక్రం తిప్పారు
సెల్‌టవర్ల ఏర్పాటులో ‘చక్రం’తిప్పిన అధికారి కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 సెల్‌టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. నగరపాలక సంస్థకు చెందిన వాటర్ ట్యాంకు స్థలాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు నెలకు రూ.2,300 అద్దె చెల్లిస్తే చాలంటూ ఆర్డరు ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ) సంతకం ఉండాల్సి ఉన్నప్పటికీ తోసిపుచ్చారు. కమిషనర్‌తో గప్‌చుప్‌గా సంతకం చేయించారు. ప్రైవేటు స్థలంలో కనీసం రూ.10వేల చొప్పున సెల్ టవర్ కంపెనీలు అద్దె చెల్లిస్తున్నాయి. ఈ విషయం మేయర్ చెవిన పడటంతో విచారణ చేపట్టాల్సిందిగా కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కమిషనర్ పాత ఫైల్‌ను తెప్పించి పరిశీలించారు. ఇప్పుడేం చేయాలనే దానిపై కమిషనర్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
టెన్షన్ టెన్షన్
టౌన్‌ప్లానింగ్ విభాగంలో 2013 నుంచి పనిచేసిన అధికారులు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల జాబితాను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇటీవల విడతలవారీగా జరిగిన బదిలీల్లో 95 శాతం మంది బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, టీపీఎస్‌లు బదిలీ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం వారు విధులు నిర్వర్తిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించినట్లు పత్రికల ద్వారా సమాచారం తెలుసుకున్న వీరిలో కొందరు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్‌లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీసే పనిలో వారంతా నిమగ్నమయ్యారు. మొత్తంమీద ఏసీబీ తనిఖీలు టౌన్‌ప్లానింగ్‌లో టెన్షన్ పుట్టించాయి.
టౌన్‌ప్లానింగ్‌కు బ్యాండ్ బాజా!
Published Wed, Sep 9 2015 3:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement