ఇసుక వ్యాపారం బంగారం
- కాసుల వర్షం
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- యథేచ్ఛగా చెరువుల తవ్వకాలు
కలిదిండి : కాసుల వర్షం కురిపిస్తుండటంతో కలిదిండి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. ఇసుకకు డిమాండ్ పెరగడంతో వ్యాపారం బంగారంలా మారిం ది. దీంతో ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుంది. అనుమతులున్నాయన్న సాకుతో కేటాయించిన విస్తీర్ణం కన్నా అధి విస్తీర్ణంలో అడ్డగోలుగా తవ్వేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని కొండూరు, గోపాలపురం, వెంకటాపురం గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతుంది.
ఇటీవల ఇసుక మట్టితవ్వకాలపై (లోకల్ శాండ్) నిబంధనలను పూర్తిగా సడలించటంతో పాటు నేరుగా తహశీల్దార్ నుంచి మైనింగ్ శాఖకు వెళ్లి అనుమతులు తెచ్చుకునే అవకాశం కలిగింది. దీంతో ఇసుక మాఫియా గ్రామాల్లో మెరక భూములను, ఇసుక దిబ్బలను, గుర్తించి రైతుల పేరిట వారే సంబంధిత యంత్రాగాన్ని మేనేజ్ చేసుకుని అనుమతులు తెచ్చుకుంటున్నారు.
ఒక ట్రాక్టరు ఇసుకమట్టి దిగుమతి చేసే దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. అలాగే లారీ టిప్పర్ వంటి వాహనాల్లో ఒక లోడు రూ. 1000 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతోంది. అక్రమ తవ్వకాలను రెవెన్యూ యం త్రాంగంఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనుమతి ఉన్నంత వరకు మార్కింగ్ చేసి బయటికి విక్రయిస్తున్న ప్రతి ట్రాక్టరు, లారీ వెంట సీనరేజి చేల్లించిన బిల్లులను తనిఖీ చేయాల్సిన అధికారులు వదిలి వేయడంతో ఒకే బిల్లుపై రోజంతా వాహనాల్లో ఇసుక రవాణా చేస్తున్నారు.
అసైన్‌మెంట్ భూములకు కూడా సిఫారసులు..
మండలంలోని కోరుకొల్లు గ్రామంలోని అసైన్‌మెంట్ భూములకు కూడా మత్స్యశాఖ అధికారులు చెరువులు తవ్వుకోవటానికి సిఫారసు చేస్తున్నారు. దీంతో అసైన్‌మెంట్ భూముల్లో అనధికారికంగా చెరువులు తవ్వుతున్నారు. మండలంలోని ఆరుతెగలపాడు, కొండంగి గ్రామాల్లో చెరువు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
తహశీల్దార్ వివరణ....
మండలంలోని జరుగుతున్న ఇసుక తవ్వకాల పై తహశీల్దార్ ఆంజనేయులను వివరణ కోరగా కొండూరు గ్రామంలోని ఇసుక తవ్వకాలకు మాత్రమే అనుమతులున్నాయని, మిగిలిన గ్రామాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని, ఆరుతెగలపాడులో చెరువుకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు.