హడావుడే! | Bustling! | Sakshi
Sakshi News home page

హడావుడే!

Published Sat, Nov 8 2014 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

హడావుడే! - Sakshi

హడావుడే!

మొక్కజొన్న రైతు ఆశలను ప్రభుత్వం బజారుకీడ్చింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చినా.. అంతలోనే నీళ్లు చల్లింది. ఆదేశాలు జారీ చేయకనే.. కేంద్రాలకు పచ్చజెండా ఊపేసింది. మూడు రోజులు గడిచినా.. కొనుగోళ్లు లేకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి దిగు బడులు తీసుకొచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు కాదని టెండర్‌దారు చేతులెత్తేయగా.. ఆదేశాలు లేవని అధికారులు మిన్నకుండిపోగా.. గోనె సంచులు కూడా లేవని కొనుగోళ్లకు సున్నా చుట్టడం అన్నదాతను కలవరపరుస్తోంది.
 

 నందికొట్కూరు: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించామనే ప్రకటనతో ప్రభుత్వం హడావుడి చేసింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా గత బుధవారం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభింపజేశారు. ఇంకేముంది.. దిగుబడులను విక్రయించి సొమ్ము చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు పరుగుపెట్టారు. మార్కెట్‌యార్డుకు దిగుబడులను తరలించారు. అయితే అధికారులేమో తమకు ఆదేశాలు రాలేదంటూ చేతులెత్తేశారు.

ఫలితంగా రెండు రోజుల నుంచి మార్కెట్‌లో దిగుబడులకు కాపలాగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. చలికి వణుకుతూ.. ఈ రోజు, రేపు అంటూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో టెండర్‌దారుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయలేమని తెగేసి చెప్పడంతో రైతులతో పాటు అధికారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎం.లింగాపురం, పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఈనెల 5న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడుల కొనుగోలు లక్ష్యంగా ఎంచుకున్నట్లు ప్రకటించారు. మాటలు చెప్పడం బాగానే ఉన్నా.. కొనుగోళ్లు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయం తెలియని రైతులు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో దిగుబడులతో కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటూ వ్యయప్రయాసలకు లోనవుతున్నారు.

కొనుగోలు కేంద్రాలకు అడంగల్ తీసుకుని రావాలని చెప్పడంతో.. ఆ పత్రం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ దిగుబడులు కొనుగోలు చేయకపోవడంతో ఈ ప్రభుత్వం తీరింతేనంటూ నిట్టూరుస్తున్నారు. ట్రాక్టర్లలో మార్కెట్‌కు దిగుబడులను తరలించేందుకు దాదాపు రూ.2వేలు ఖర్చవుతోంది. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలంటే మరో రూ.2వేలు చెల్లించాల్సిందే. నాయకులు, అధికారులను నమ్ముకున్నందుకు తగిన శాస్తే జరిగిందంటూ రైతులు తమ దయనీయ స్థితికి కన్నీరు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కానీ.. హడావుడి చేసిన అధికారులు కానీ మూడు రోజులుగా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.
 
 ఈళ్లని నమ్ముకుంటే ఇంతే...
 ఉప ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిసి సంతోషపడ్డాం. ఎంతో ఆశతో మొక్కజొన్నను విక్రయానికి తీసుకొస్తే అధికారులు ఇంకా ఆదేశాలు రాలేదంటున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రారంభించినట్లు. ఈళ్లని నమ్ముకుంటే ఇంతే. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి కాకపోతే.. ఇదంతా ఎందుకు. - సయ్యద్ బాషా, మల్యాల
 
 ఎకసెక్కాలాడుతాండ్రు

 పంట పండించనీక నానా కస్టాలు పడినాం. ఎక్కడపడితే అక్కడ అప్పులు పెరుక్కొచ్చినం. అంతంత మాత్రం పంటే వచ్చింది. అమ్ముకుందామంటే ధర లేకపాయ. ప్రభుత్వం మేలు సేస్తాదనుకుంటే ఎకసెక్కాలాడుతాంది. మోడమైతుంటే వానొస్తాదేమోనని భయమేత్తాంది. ఇప్పటికైన ఎప్పుడు కొంటారో సెప్తే బాగుంటాది. - ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు
 
 అనుమతులు రాలేదు

 మొక్కజొన్న కొనుగోలుకు అనుమతులు రావాల్సి ఉంది. కొనుగోలు టెండరుదారుడు గిట్టుబాటు కాదని వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ట్రాన్స్‌పోర్టర్లు కూడా ముందుకు రాలేదు. అనుమతులు వచ్చే వరకు ఏమీ చేయలేం. రైతులు ఒత్తిడి చేస్తున్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లాం.
 - నబీ సాహెబ్,
 డీసీఎంఎస్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement