ఆ చర్యలతో బాబుకే నష్టం: రాఘవులు
తిరుపతి : ప్రత్యేక హోదా సాధన కోసం విపక్షాలు జరుపుతున్న ఆందోళనలను పోలీసుల నిర్భంధంతో అణచివేయడం వల్ల చంద్రబాబుకే నష్టమని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా పోలీస్ రాజ్యంగా మారుతోందని, ప్రశ్నించే వారిని అణగదొక్కే క్రమంలో చంద్రబాబు పోలీసుల ద్వారా ఉద్యమకారులను నిర్బంధానికి గురి చేయడం సహేతుకం కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.4 లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీస్తామన్న ప్రధాని మోదీ సర్కారు ఇప్పటి వరకు ఎంత మేర బయటకు తీసిందో వెల్లడించలేదని ఆయన మండిపడ్డారు.
రూ.16 లక్షల కోట్ల విలువ చేసే రూ.500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేస్తే, బ్యాంకుల్లోకి రూ.17 లక్షల కోట్లు వచ్చాయని ఆరోపించారు. పార్టిసిపేటరీ కరెన్సీ(విదేశీ ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసే కరెన్సీ)ని రద్దు చేస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బు బయటకు వస్తుందని అన్నారు. అసలు నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని బయటకు తీయడం కోసం కాదని, వేరే ఉద్దేశంతో చేసిన పనిగా రాఘవులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తప్పని సరిగా లెక్కలు చెప్పాల్సిందేనని, లేదంటే మోదీని మాయల మరాఠీగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలు అడ్డమైన సవాళ్లు విసరడం మాని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని రాఘవులు సూచించారు.