సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో అమరావతి వేదికగా టీడీపీ ప్రభుత్వం పాల్పడిన కుంభకోణం బట్టబయలైంది. రాజధాని అవినీతిపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నివేదికను సమర్పించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిని బహిర్గతం చేసింది. ఉపసంఘం బయటపెట్టిన నివేదికలో అమరావతిలో వేలకోట్ల అవినీతి జరిగినట్టు తేలింది. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టింది. టీడీపీ నేతల బండారాన్ని మంత్రివర్గ ఉపసంఘం పూస గుచినట్టు వివరించింది. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు 4,075 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు నివేదిక పేర్కొంది. (ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు)
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ల పేర్లతో భారీగా భూ కొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదికన ప్రభుత్వానికి సమర్పించింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలందరి భూ కుంభకోణాలను కమిటీ బట్టబయలు చేసింది. 900 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా కొనుగోలు చేసినట్టు కూడా కమిటీ నివేదికలో తెలిపింది. తెల్ల రేషన్ కార్డు దారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది.
హైద్రాబాద్‌లో తెల్ల రేషన్ కార్డు దారులు కూడా అమరావతిలో భూములు కొన్నట్టు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొన్నట్టు కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసమే సీఆర్‌డీఏ పరిధిని అనేక మార్లు మార్చినట్టు ఆధారాలు గుర్తించిన ఉపసంఘం, దానిని ప్రభుత్వానికి సమర్పించింది. భారీ కుంభకోణం బయటకు రావడంతో టీడీపీ నేతలు బండారం బయటపడినట్లయింది. కాగా రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment