కొత్తపేట : కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలోని ఓ కాఫీ హోటల్ యజమాని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. హతుడు సూరవరపు పట్టాభిరామారావు అలియాస్ రాంబాబు (55) తల ఎడమ వైపు, చెవి, చేతిపై కత్తిగాట్లు ఉండడంతో గుర్తుతెలియన వ్యక్తులు హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. మండల పరిధిలోని బిళ్లకుర్రు శివారు యెలిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన రాంబాబు అన్నదమ్ములు ఆరుగురు. వీరంతా ఉమ్మడిగా కండ్రిగ రేవులో కాఫీ హోటల్ నిర్వహించేవారు. పెద్ద సోదరుడు అప్పారావు హోటల్ వదిలి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
నాలుగో సోదరుడైన రాంబాబు ఏడాదిన్నర క్రితం ఉమ్మడి హోటల్‌కు సమీపంలోనే తన వాటాగా వచ్చిన స్థలంలో భవనం నిర్మించుకుని హోటల్ నిర్వహిస్తున్నాడు. మిగిలిన నలుగురు సోదరులు ఉమ్మడిగా హోటల్, పాలకోవా తయారీ వ్యాపారం చేసుకుంటున్నారు. హతుడు రాంబాబుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆరు నెలల క్రితం కుమారుడు సుబ్బారావు (సురేష్)కు వివాహమైంది. నెలరోజుల తరువాత తండ్రితో విభేదించి, తన పెదనాన్న వద్ద పనిచేస్తున్నాడు. రాంబాబు మరో మహిళను కూలికి పెట్టుకుని హోటల్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి హోటల్ మూసేసి అక్కడే అరుగుపై పడుకున్నాడు. శుక్రవారం ఉదయం పేపర్‌బోయ్, పాల బోయ్ వచ్చి లేపగా లేవకపోవడంతో వారు అతడి సోదరులకు సమాచారమిచ్చారు. అతడి సోదరుడు ధర్మారావు, కుమారుడు వచ్చి చూడగా.. తలకు గాయమై రక్తం కారడాన్ని గమనించారు.
వెంటనే ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకువచ్చి పరీక్షించగా చనిపోయినట్టు నిర్ధారించారు. పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్య, రావులపాలెం సీఐ పీవీ రమణ, ఎస్సై డి.విజయకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, హోటల్ పరిసరాలను పరిశీలించారు. మృతదేహం ముఖంపై నీళ్లు కొట్టినట్టు, రెండు గదుల తలుపులకు వేసిన తాళాలు పగలకొట్టినట్టు గుర్తించారు. సోదరులను, స్థానికులను విచారించారు. హతుడికి ఎవరితోనూ విభేదాలు లేవని స్థానికులు తెలిపారు. హతుడు సోదరుడు ధర్మారావు ఫిర్యాదు మేరకు 302,457 సెక్షన్ల కింద పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి విజయకుమార్ తెలిపారు. డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ రమణ దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది.
కాఫీ హోటల్ యజమాని హత్య?
Published Sun, Feb 28 2016 1:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement