ఏపీ ప్రభుత్వ తీరును కడిగిపారేసిన కాగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ భారీగా అక్షింతలు వేసింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీరుపై కాగ్ కడిగిపరేసింది. పట్టిసీమను ఓ ప్రతికూల ప్రాజెక్ట్‌గా కాగ్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌పై ఖర్చు చేసిన దానికి, దాని వల్ల పొందే ప్రయోజనానికి మధ్య పొంతనే లేదని కాగ్ వెల్లడించింది. పోలవరం కుడికాల్వ, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చేపట్టారని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ పథకం చేపట్టడం మూలంగా ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది.
పట్టిసీమ టెండర్ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడా సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారని.. దీని ద్వారా 199 కోట్ల అధనపు భారం పడిందని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. అవసరం లేకున్నా నిర్మాణ పద్ధతిని మార్చారని, దీని ద్వారా 106 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. పైపుల మీద రాయితీ ఉన్నా.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కాంట్రాక్టర్‌కు తిరిగి చెల్లించారని రిపోర్ట్ వెల్లడించింది. ఈపీసీ ఒప్పందాల్లో లేని నిబంధనల కారణంగా ప్రభుత్వం మరో రూ. 20.62 కోట్లు నష్టపోయిందని వెల్లడించింది.
కాగ్ రిపోర్ట్‌లోని అంశాలు..
► గురు రాఘవేంద్ర పులికనుమ ప్రాజెక్ట్‌లో 4.12 కోట్లు ప్రభుత్వం నష్ట పోయింది. పైపుల సామర్థ్యం తగ్గినా.. మిగులు అనేది ప్రభుత్వానికి దక్కకుండా పోయింది. సరైన నిర్వహన, శ్రద్ధ లేకపోవడం మూలంగా ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలు అందడం లేదు.
► పురుషోత్తపట్నం పంప్‌హౌస్ విషయంలో కాంట్రాక్టర్‌కు రూ. 1.57 కోట్ల అనుచిత లబ్ధి చేకూరింది.
► పుష్కర ఎత్తిపోతల పథకం కింద సరైన ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటైనా వాటిమీద కాంక్రీట్ పనులు పూర్తి కావడం లేదు. ప్రభుత్వం చెబుతున్న ఆయకట్టు టార్గెట్‌ను చేరుకోవడం లేదు.
► వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల పనితీరు ఘోరం. 99 మార్కెట్ యార్డ్‌లు తనిఖీ చేస్తే.. 90 చోట్ల ఎలాంటి లావాదేవీలు జరగలేదు. వీటిని పర్యవేక్షించడానికి సరైన యంత్రాంగం లేదు. మార్కెటింగ్ శాఖ వద్ద కనీస వివరాలు లేవు.
► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 53లో పనుల పరిధి తగ్గినా ప్రభుత్వానికి డబ్బు మిగల్లేదు. రూ. 6.47 కోట్ల మిగులు ఖజానాకు చేరలేదు.
► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 610లో కాంట్రాక్టర్‌కు లబ్ధి. రూ. 4.97 కోట్ల మేర అధిక చెల్లింపులు.
► వృద్ధాప్య పెన్షన్ల కోసం చేసిన దరఖాస్తులు లక్షల కొద్ది పెండింగ్‌లో ఉన్నాయి. వయో వృద్ధుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు ఇవ్వడం లేదు.
► విశాఖలోని ప్రధాన వాణిజ్య ప్రాంతంలో భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించారు. దీని ద్వారా ప్రభుత్వానికి 63.89 లక్షల రూపాయల నష్టం.
► రెసిడెన్సియల్ స్కూళ్లకు ఆహారాన్ని తక్కువగా సరఫరా చేస్తున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేయడం లేదు. పర్యవేక్షణ అత్యంత పేలవంగా ఉంది.
► కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయడం లేదు.