సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
జిల్లాకేంద్రంలోని స్థలాలపై కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, వారి బంధుగణం ఆక్రమణలకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వెనుక కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ శివారు మావల చెరువు శిఖంను ఆక్రమించి ఫంక్షన్ హాల్‌లను నిర్మించిన వ్యవహారమే తాజా ఉదాహరణ. భూముల ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ బాబు ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ అక్రమార్కుల చిట్టా విప్పుతోంది. గతంలో నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్, కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌ల నిర్మాణంలో మావల చెరువు శిఖం ఆక్రమణకు గురైనట్లు తేలింది.
మావల శిఖంపై ‘రెవెన్యూ’ పోస్టుమార్టం
నిజాం కాలం నాటి మావల చెరువు ఆదిలాబాద్ శివారు ఏడో నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. 131, 135 సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ చెరువును ఆనుకొని ఫోర్‌లేన్ పడటంతో భూముల ధరలు పెరిగాయి. దీంతో చెరువును ఆనుకొని ఉన్న పట్టా స్థలాలపై అధికార పక్షం, ప్రతిపక్ష నాయకులు, భూమాఫియా కన్ను పడింది. చెరువును ఆనుకుని ఉన్న సర్వే నంబర్లపై ‘బినామీ’ పట్టాదారుల్ని సృష్టించి సుమారు రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వెలువడిన కథనాలపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ విచారణ జరిపింది. మావల చెరువు శిఖం 10.36 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అంగీకరిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణదారుల పేర్లు బయట పెట్టడంలో దోబూచులాడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
1.30 ఎకరాల పట్టాపైనా అనుమానాలే?
మావల చెరువును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ యజమాని పేరిట 1.30 భూమికే పట్టా ఉండగా, సదరు వ్యక్తి 4 ఎకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టారు. సుమారు ఎనిమిది నెలల క్రితమే ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం జరగ్గా అప్పుడున్న ఉన్నతాధికారులతోపాటు రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. 1.30 ఎకరాలకు పట్టాపొందిన ఓ ఉన్నతస్థాయి బ్యాంకు అధికారి 4 ఎకరాల్లో మావల చెరువును ఆనుకుని ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్న వ్యవహారంపై స్పందించిన అధికారులు నిర్మాణాన్ని ఆపేశారు.
ఫంక్షన్‌హాల్ నిర్మాణం కోసం వేసిన బోరు చెరువు శిఖంలో వేయగా, దానిని అధికారులు తొలగించాలని ఆదేశించారు. కాగా సదరు వ్యక్తి పేరిట ఉన్న 1.30 ఎకరాలు పట్టా భూములని చెప్తున్నా, అందుకు సంబంధించిన లింక్‌డ్ డాక్యుమెంట్‌పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే పదేళ్ల క్రితం నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్స్ చెరువు శిఖం ఆక్రమణలో జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఆక్రమణకు గతంలో మావల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఆక్రమణకు గురైన 10.36 ఎకరాల్లో పాగా వేసిన ఆక్రమణదారుల గుట్టురట్టు చేసి, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లెక్క తేలింది
Published Mon, Oct 7 2013 3:18 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement