‘కాల్‌మనీ’ కాటుకు బలి | call money isssue | Sakshi
Sakshi News home page

‘కాల్‌మనీ’ కాటుకు బలి

Published Tue, Feb 16 2016 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

call money isssue

అప్పుల బాధ తాళలేక వస్త్రవ్యాపారి ఆత్మహత్య
రూ.6 లక్షలకు రూ.18 లక్షలు వడ్డీ
కట్టానని సూసైడ్‌నోట్

  
ఇరగవరం/తణుకు/పెరవలి :  కాల్‌మనీ కాటుకు మరో ప్రాణం బలైంది. అప్పులిచ్చిన వాళ్ల అధిక వడ్డీ వేధింపులు తాళలేక ఓ వస్త్ర వ్యాపారి మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పూనుకున్నారు. తన కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చారు. బాధితుని సూసైడ్‌నోట్, బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల ధనరాజు (31) తణుకులో రెడీమేడ్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. టైలరింగ్ చేస్తూనే ఆయన వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారం నిమిత ్తం తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరి వద్ద రూ.3 లక్షలు, ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామానికి చెందిన మేడపాటి తాతిరెడ్డి వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరిలకు వడ్డీ నిమిత్తం ఇప్పటివరకు రూ. 8 లక్షలు, మేడపాటి తాతిరెడ్డికి వడ్డీ నిమిత్తం రూ.10 లక్షలు చెల్లించారు. వ్యాపారం బాగా లేకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. కాల్‌మనీ వల్ల అధిక వడ్డీల భారం పడింది.

ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తుండడంతో ధనరాజు మనస్థాపానికి గురయ్యారు.  మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుంచి తణుకు వచ్చిన ధనరాజు  పురుగులమందు డబ్బా కొనుక్కుని పెరవలి మండలం తీపర్రు గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ పురుగులమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతని బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి ధనరాజును మోటారుసైకిల్‌పై తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనరాజు ప్రాణాలు వదిలారు. దీంతో స్వగ్రామం సూరంపూడికి తీసుకెళ్లారు. ధనరాజు పంచాయతీ వార్డు సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు.

 
 ఎమ్మెల్యే.. ఎస్పీల పేరిట సూసైడ్ నోట్
ధనరాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్‌లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లకు ధనరాజు తన ఆవేదనను వెలిబుచ్చారు. తన భార్య నగలు అమ్మి అధిక వడ్డీలు కట్టానని, ఇకపై వడ్డీలు, అప్పు కట్టలేని పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తాళలేకే తాను చనిపోతున్నట్టు వివరించారు. తాను చేసిన అప్పులకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధమూ లేదని, తాను చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుడు ధనరాజుకు భార్య చంద్రకళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ధనరాజు ప్రస్తుతం  తణుకులో అనూషా డ్రస్ మెటీరియల్స్ పేరుతో వస్త్రదుకాణం నిర్వహిస్తూ ఇక్కడే ఫ్లాట్ అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు.  దీనిపై పెరవలి ఎస్‌ఐ పి.నాగరాజు కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement