చల్లపల్లి కేంద్రంగా జోరుగా జూదం
- బడుగులను చిదిమేస్తున్న నంబర్లాట
- రోడ్డున పడుతున్న బడుగులు
- రోజుకు రూ.5 లక్షలకు పైగా చేతులు మారుతున్న వైనం
- పట్టించుకోని పోలీసులు
చల్లపల్లి : నంబర్లాట బడుగుల బతుకులను చిదిమేస్తోంది. ప్రత్యేకించి కాయకష్టం చేసి పొట్టపోసుకొనే వారిని టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ ఆట వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును అరవెరైట్లు పెరుగుతుందన్న ఆశతో సాయంత్రం వేళ ఆటలో పెట్టి, తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు చల్లపల్లికి మాత్రమే పరిమితమైన నంబర్లాట ఇప్పుడు ఘంటసాల, మోపిదేవి మండలాలకు విస్తరించింది. ఇదంతా పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.
నంబర్లర్లాట ఇలా..
చల్లపల్లి ప్రాంతంలో నంబర్లాటను బ్రాకెట్ అంటారు. ప్రతిరోజూ ఓ దినపత్రికలో వచ్చే అసోం లాటరీ నంబర్లను ఎంచుకుని ఆట మొద లెడతారు. చివరి రెండు నంబర్లను ఎంచుకున్న వారిని డబుల్‌డిజిట్ అంటారు. ఈ ఆటలో వారు కోరుకున్న చివరి రెండు నంబర్లు వస్తే.. వారు లాటరీలో పెట్టినప్రతి రూపాయికి రూ.66 చొప్పున (66 రెట్లు) చెల్లిస్తారు. ఓపెనింగ్, క్లోజింగ్‌లో ఒక నంబరును ఎంచుకునే వారిని సింగిల్ డిజిట్ అంటారు. ఈ ఆటలో కోరుకున్న నంబర్లు వచ్చిన వారికి రూపాయికి పదిరూపాయలు మాత్రమే ఇస్తారు.
రోజుకు రూ.5లక్షలు
చల్లపల్లి కేంద్రంగా జరుగుతున్న నంబర్లాటలో రోజుకు రూ.5లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు తెలిసింది. నలుగురు నిర్వాహకుల పరిధిలో 45 మంది బుక్కర్లు ఉదయం ఏడు గంటలకే ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు 25 నుంచి 60 మంది ఆటగాళ్ల నుంచి నంబర్లు, పందెం డబ్బు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి రూ.5 రూపాయల నుంచి రూ.వెయ్యి వరకూ నంబర్లపై పందెం కాస్తుంటారు. బుక్కర్లు చిన్న కాగితాలపై ఆ నంబర్లను రాసి ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటలకు చల్లపల్లిలోని ఓ నెట్ సెంటర్‌లో అసోం లాటరీని నెట్‌లో ఓపెన్‌చేసి నిర్వాహకులు దాని కాపీని తీసుకుంటారు. అనంతరం ఆ లిస్టును బుక్కర్లకిచ్చి ఎంచుకున్న నంబర్లు వచ్చినవారికి ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చేస్తారు. సుమారు 3వేల మంది ఈ ఆటకు బానిసలుగా మారారంటే ఆట ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
బలవుతున్న బడుగులు
చిరు వ్యాపారులు, ముఠా, దినసరి కూలీలు, రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, షాపుల్లో పనిచేసే వర్కర్లు నంబర్లాట ఎక్కువగా ఆడుతుంటారు. చివరి రెండు నంబర్లు ఎంచుకున్నవారికి 66 రెట్లు సొమ్ము వస్తుండటంతో ఎక్కువ మంది ఆశగా ఈ ఆటనే ఆడుతుంటారు. ఈ ఆట ద్వారా డబ్బు గెలుచుకునేది చాలా తక్కువమంది. డబ్బు పోగొట్టుకున్నవారే అధికం. కొందరైతే పనిచేస్తే వచ్చే డబ్బులు చాలక అప్పులు తెచ్చి ఆటలో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
గ్రామాలకు పాకుతోంది..
గతంలో ఈ ఆట చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రమే సాగేది. ప్రస్తుతం మోపిదేవి, ఘంటసాల మండలాకు విస్తరించింది. చల్లపల్లి సెంటర్, నారాయణరావునగర్, పాగోలు, పురిటిగడ్డ, పెదకళ్లేపల్లిరోడ్, సాలిపేట, రామానగరం, లక్ష్మీపురం, యార్లగడ్డరోడ్, పురిటిగడ్డ, నదకుదురు, మోపిదేవి మండలం వెంకటాపురం, కఫ్తానుపాలెం, పెదప్రోలు, ఘంటసాల మండలం కొడాలి, చిట్టూర్పులకు పాకింది.
పోలీసుల ప్రోత్సాహంతోనే ..
నాలుగేళ్ల క్రితం చల్లపల్లి కేంద్రంగా నంబర్లాట జోరుగా సాగింది. అప్పట్లో పలుమార్లు గొడవలు జరగడం, చాలామంది పేదలు రోడ్డున పడటంతో అప్పటి ఎస్పీ హరికుమార్ తీవ్ర చర్యలు తీసుకోవడంతో రెండేళ్ల పాటు ఈ ఆట కనుమరుగైంది. ఆ తర్వాత చల్లపల్లికి బదిలీపై వచ్చిన ఓ ఎస్.ఐ ఈ ఆటను పునఃప్రారంభించేందుకు ప్రోత్సాహం అందించారు. తద్వారా నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం వీఆర్‌పై ఎస్‌ఐ బదిలీ అయినప్పటికీ తరువాత వచ్చిన పోలీస్ అధికారులు జోరందకున్న నంబర్లాటను అరికట్టలేక పోయారు. ఇప్పుడు కూడా పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెపుతున్నట్టు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. నంబర్లాటపై పత్రికల్లో, టీవీల్లో వార్తలు రాకుండా చూసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ‘సాక్షి’లో పలుసార్లు నంబర్లాటపై కథనాలు వచ్చినపుడు కొద్దిరోజులు కట్టడి చేసినప్పటికీ తరువాత మళ్లీ మామూలయిపోయింది.
పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే..
చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే నంబర్లాట జరుగుతున్నప్పటకీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ధానిక సంతబజార్, ప్రధాన సెంటర్‌లోని పెట్రోల్ బంకు సమీపంలో నిర్వాహకులు యథేచ్చగా నంబర్లాట సాగిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. బడుగుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న నంబర్లాటను అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.