గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి | Can we get New ID cards in this way, if you lost or stolen | Sakshi
Sakshi News home page

గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి

Published Thu, Aug 14 2014 6:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

గుర్తింపు ‘కార్డు’ పోయిందా..  ఇలా చేయండి

గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి

డ్రైవింగ్ లెసైన్స్.. ఓటరు గుర్తుంపు కార్డు.. రేషన్ కార్డు.. ఏటీఎం.. ఆధార్ కార్డు.. ఇవన్నీ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేవి. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా కార్డుపోతే ఏం చేయాలో అర్థంగాక ఆందోళన పడుతుంటాం. అయితే వాటిని మళ్లీ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి..      
 - చిత్తూరు టౌన్
 
 పాన్‌కార్డు
 ఆదాయపు పన్నుకు అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్)కార్డు పోగొట్టుకుంటే.. సంబంధిత ఏజెన్సీల్లో పాత పాన్‌కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. కొత్తకార్డు కోసం అదనంగా మరో 96 రూపాయలు చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీచేస్తారు. www.nsdl.pan వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
 
 పాస్‌పోర్టు
 పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్‌ట్రేస్డ్ పత్రంతో పాస్‌పోర్టు కార్యాలయం, హైదరాబాద్  పేరిట వెయ్యి రూపాయల డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తర్వాత డూప్లికేట్ పాస్‌పోర్టును జారీ చేస్తారు. తత్కాల్ పాస్‌పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov. in ను సంప్రదించవచ్చు.
 
 ఓటరు గుర్తింపు కార్డు
 ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్‌తో *10  రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www. ceoandhra.nic.in  వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
 
 ఆధార్‌కార్డు
 ఆధార్‌కార్డు పోగొట్టుకుంటే టోల్‌ఫ్రీ నెంబర్ 18001801947లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai. gov.in  వెబ్‌సైట్లో పూర్తి సమాచారం పొందవచ్చు.
 
 డ్రైవింగ్ లెసైన్స్
 వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో డ్రైవింగ్ లెసైన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జతచేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. అలాగే 10 రూపాయల బాండ్‌పేపరుపై కార్డుపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలి. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. aptransport.org వెబ్‌సైట్ నుంచి ఎల్‌ఎల్‌డీ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందవచ్చు.
 
 ఏటీఎం కార్డు
 ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా.. ఎవరైనా దొంగలించినా.. ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తర్వాత ఫిర్యాదు నెంబర్ ఆధారంగా బ్యాంకులో కొత్త కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.
 
 రేషన్‌కార్డు
 గుర్తింపుతో పాటు రేషన్‌షాపుల్లో సరుకులు తీసుకోవడానికి రేషన్‌కార్డు అవసరం. ఇదిపోతే www.icts2.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. అక్కడ ఉన్న username guest, password guest123  సాయంతో విచారణ(క్వేరీ) ఉపయోగించి మన రేషన్‌కార్డు నంబర్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్‌లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే మండల తహశీల్దార్ దానిని పరిశీలించి నామ మాత్రపు రుసుంతో అదే నంబరుపై కార్డు జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement