నాలో కేన్సర్ కణాలు ప్రవేశించాయి: అక్కినేని
హైదరాబాద్ : తన శరీరంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించినట్లు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. అయితే భయపడాల్సిన పని లేదని, క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందే ప్రమాదం లేనందున వచ్చిన ముప్పేమి లేదన్నారు.ఆయన అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం తనకు 90 ఏళ్లని అభిమానుల అండతో కనీసం మరో ఆరేళ్లు ఖచ్చితంగా బతుకుతానని అన్నారు.
అభిమానుల ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అక్కినేని అన్నారు. క్యాన్సర్ అంత పెద్ద జబ్బేమి కాదని ఆయన చెప్పారు. గతంలో రెండు సార్లు ప్రమాదకరమైన జబ్బులను జయించిన తాను.... ఈసారి క్యాన్సర్‌ను కూడా జయించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. మనోదైర్యం, గుండె నిబ్బరంతో ఎంతటి అనారోగ్యాన్ని అయినా జయించవచ్చన్నారు. ఈ విషయాన్ని అందరికీ చాటిచెప్పేందుకు తన అనారోగ్యం గురించి బయటపెట్టినట్లు ఆయన చెప్పారు.
అన్ని జబ్బులకు మనోదైర్యమే అసలు మందన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానని అక్కినేని తెలిపారు. తన తల్లి కూడా 96ఏళ్లు జీవించినట్లు ఆయన చెప్పారు. తన 74ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నానని అక్కినేని పేర్కొన్నారు.