పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు
అపరిశుభ్రనీటినే క్యాన్లలో నింపేస్తున్న వైనం
వ్యాధులబారిన పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం సమీపాన ఓ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ బోరు నీటినే సక్రమంగా శుద్ధి చేయకుండా సురక్షిత జలమంటూ ప్రజలకు అంటగడుతున్నారు. కాజూరు, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లెల్లోనూ ఇదే పరిస్థితి... ఇది ఒక్క చిత్తూరు నగరంలోనే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అపరిశుభ్ర నీటినే క్యాన్లకు నింపి ప్లాంట్ల యజమానులు ‘శుద్ధ’ మోసం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చిత్తూరు (కార్పొరేషన్) : చట్టంలోని లొసుగులు అక్రమ నీటి వ్యాపారులకు చుట్టాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్ర నీటినే క్యాన్లలో నింపి సురక్షిత జలమని అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రమాణాలకు పాతరవేస్తున్న వాటర్‌ప్లాంట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలకు పాతర
జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 30 వాటర్ ప్లాంట్లు, అనధికారికంగా 400 ప్లాంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేని ప్లాంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రంగు నీళ్లు, బోరు నీటినే క్యాన్లకు నింపి, నకిలీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్టిక్కర్లు అంటించి అమ్మేస్తున్నారు. కనీసం క్యాన్లు కూడా సక్రమంగా ుభ్రం చేయడంలేదు. 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.50 కోట్ల వరకు నీటి వ్యాపారం సాగుతోంది.
నామమాత్రంగా దాడులు
వాటర్ ప్లాంట్ల నిర్వహణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. ఒకటిన్నర సంవత్సరంగా కేవలం 4 ప్లాంట్లపై తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బాలకార్మికులే ఎక్కువ
వాటర్ ప్లాంట్లలో బాలకార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. తక్కువ కూలీకి వస్తారనే నెపంతో ప్లాంట్ల యజమానులు చిన్నపిల్లలనే ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల మంది బాలకార్మికులు పనిచేస్తున్నా కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
బీఐఎస్ ఉంటేనే
బీఐఎస్ గుర్తింపు ఉన్న వాటర్ ప్లాంట్లు మాత్రమే మా పరిధిలోకి వస్తాయి. విడి నీళ్ల అమ్మకాలు మాకు సంబంధం లేదు. వాల్టా చట్టాన్ని అనుసరించే ప్లాంట్లకు అనుమతించాలి. కలుషిత నీటిని అమ్మితే చర్యలు తప్పవు. - శ్రీనివాసులు, జిల్లా ఆహార తనిఖీ అధికారి
నిబంధనలు ఇలా..
వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ముందుగా నీటిని పరీక్షించాలి. బోరైతే వాల్టా చట్టం కింద తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అనుమతి పొంది, ప్రతి ఆరు నెలలకోసారి నీటిని పరీక్షించాలి. ప్రతి కేంద్రంలో ప్రయోగశాల ఉండాలి. రంగు, వాసన, రుచి, డెర్జిడిటీ, టోటల్
డిజుల్యడ్ సాలీడ్స్, సల్ఫైడ్, మాంగనీస్, కాపర్ తదితర 51 పరీక్షలు నిర్వహించాలి. తర్వాతే ప్లాంట్లకు అనుమతించాలి.