బిల్డర్లతో కుమ్మక్కయ్యారు | Disembarloga report on encroachment of ponds | Sakshi
Sakshi News home page

బిల్డర్లతో కుమ్మక్కయ్యారు

Published Thu, Sep 8 2016 2:18 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

Disembarloga report on encroachment of ponds

కబ్జాదారులకు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు
చెరువుల ఆక్రమణలపై  డిసెంబర్‌లోగా నివేదిక
‘రెబెల్స్’ పై విచారణ 22కు వాయిదా
స్పీకర్ కోడివాళ

 

బెంగళూరు:  నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించడానికి అనుగుణంగా అనుమతులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు దాఖలు చేయనున్నామని చెరువుల ఆక్రమణను నివారించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, స్పీకర్ కోడివాళ పేర్కొన్నారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతోమాట్లాడారు. నగరంలో కబ్జాకు గురైన చెరువులకు సంబంధించి ఇప్పటి వరకూ  99 శాతం సమాచారాన్ని సేకరించామన్నారు. అక్రమాల్లో బిల్డర్లతో కొంతమంది అధికారులు చేతులు కలిపారన్న విషయం తేలిందన్నారు. సదరు అధికారులపై క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన నివేదికను డిసెంబర్‌లోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, రాచకాలువలు అక్రమించి నిర్మించిన అన్ని రకాల నిర్మాణాలను పడగొట్టితీరుతామని ఈ విషయంలో పక్షపాత ధోరణి ఏదీ లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కోడివాళ సమాధానమిచ్చారు.

 
14న ప్రత్యేక సమావేశం: జీఎస్‌టీఅమలుపై చర్చించేందుకు ఈనెల 14న ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలను రాజకీయపార్టీలతో పాటు కొంతమంది నాయకులు తమ ప్రచారం కోసం వాడుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అందువల్లే రాష్ట్ర చట్టసభల నియమావళిలో మార్పులు తీసుకురానున్నామని వెళ్లడించారు. 14న జరిగే శాసనసభ సమావేశాలను రెండు మూడు రోజులు పొడగించే అవకాశం కూడా లేకపోలేదన్నారు.

 
‘రెబెల్స్’ పై విచారణ 22కు వాయిదా...
రాష్ట్ర శాసనసభ నుంచి శాసనమండలి, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించిన 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల పై విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తూ కోడివాళ నిర్ణయం బుధవారం తీసుకున్నారు. సదరు ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలైన చలువరాయస్వామి, జమీర్‌అహ్మద్‌ఖాన్, రమేష్‌బండిసిద్ధ హెచ్.సీ బాలకృష్ణ, అఖండశ్రీనివాస్‌మూర్తి, కే.గోపాలయ్య, ఇక్బాల్, భీమానాయక్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసినట్లు అదే పార్టీకి చెందిన బీ.బీ నింగయ్య కోడివాళకు ఫిర్యాదు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో అనర్హత విషయమై విచారణ జరిపారు. ఈ విచారణకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైకి బాలకృష్ణ, గోపాలయ్య, ఇక్బాల్ అన్సారి, శ్రీనివాసమూర్తిలు హాజరయ్యారు. మిగిలిన వారు తాము విదేశాల్లో ఉన్నట్లు స్పీకర్‌కు తెలియజేశారు. విచారణ అనంతరం కోడివాళ మీడియాతో మాట్లాడుతూ... పార్టీ విప్‌ను ధిక్కరించిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కుమారస్వామి లిఖితపూర్వకంగా తనకు తెలియజేశారన్నారు.

అనర్హతకు సంబంధించి కొన్ని సాంకేతిక పరమైన సాక్ష్యాలు ఇవ్వడంలో జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి విఫలమయ్యారు. అందువల్ల సదరు సాక్ష్యాలు అందజేయాల్సిందిగా కుమారస్వామికి సూచిస్తూ  విచారణను ఈనెల 22కు వాయిదా వేశామన్నారు. అంతేకాకుండా విచారణ సమయంలో జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్య హోదాలో తప్పక స్పీకర్ ఎదుట హాజరయ్యి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కుమారస్వామికి తెలిపామని కోడివాళ పేర్కొన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement