ప్రైవేటు బస్సుల్లో రసాయనాలు,సిగరెట్ బండిళ్ల రవాణా
పట్టించుకోని అధికారగణం
నిబంధనలు తూచ్
తగలబడుతున్న బస్సులు
బెంగళూరు : ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తుండటంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా తయారైంది. గమ్యాలకు చేరాల్సిన ప్రయాణికులు దారి మధ్యలోనే అకాల మృత్యువాత పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తల్లికి బిడ్డ దూరమవుతోంది. బిడ్డకు తల్లి దూరమవుతోంది. మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ప్రభుత్వం సైతం ఏదేని ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయడం లేదని, బుధవారం తెల్లవారుజామున హుబ్లీ సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం ఇందుకు అద్దం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ప్రయాణికులను తరలించే ప్రైవేటు బస్సుల్లో నిబంధనలను అనుసరించి ఎటువంటి సరుకును రవాణా చేయకూడదు. అయితే టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండక పోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సరుకులను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. బెంగళూరు నుంచి దేశంలోని చాలా చోట్లకు ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ బండిల్స్, రసాయనాలు, పెయింట్స్‌తో పాటు వివిధ రకాల చికిత్సల్లో వినియోగించే మందులు రవాణా అవుతున్నాయి.
ఈ పదార్థాలకు చిన్న నిప్పురవ్వ తగిలినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. మరోవైపు సాధారణంగా మల్టీయాక్సిల్ బస్సుల్లో డీజిల్ ట్యాంకు డ్రైవర్ వెనకే ఉంటుంది. అందులో 600 లీటర్ల దాకా డీజిల్ ఉంటుంది. ఈ ట్యాంకుకు చిన్న చిల్లుపడినా, లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినా ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ‘వరూరు’ ఘటనలో కూడా బస్సులో రసాయనాలు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని, వాటిని గుర్తించి తప్పించుకునేలోపే ముగ్గురు మృత్యువుపాలయ్యారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ సంస్థలకు వెళ్లి వారి లెసైన్స్‌లు, బస్సులకు పర్మిట్ ఉందా లేదా వంటి కనీస విషయాలను కూడా పరిశీలించలేదని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ట్రావెల్స్ యాజమాన్యం పై కేసులు కూడా బుక్ చేస్తున్న దాఖలాలు లేవు. అందువల్లే 2013లో పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో 48 మంది చనిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో తరుచుగా బస్సుల్లో మంటలు చెలరేగడం జరుగుతూనే ఉన్నాయని రవాణా శాఖ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.
ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏదీ..?
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ఎక్కువగా బెంగళూరుకు వచ్చి ఇక్కడే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెదుక్కుంటున్నారు. వీరు పండుగలు, శుభకార్యాల సమయంలో స్వంత ఊళ్లకు వెళ్లడానికి అవసరమైనన్ని కేఎస్‌ఆర్టీసీ బస్సులు కానీ, రైళ్లు కానీ లేవు. బెంగళూరు -హైదరాబాద్ విషయమే తీసుకుంటే (ఉత్తర కర్ణాటక ప్రాంతాల మీదుగా) రాష్ట్ర రవాణాశాఖకు చెందిన ఏసీ, నాన్‌ఏసీలు కలిపి రోజూ సుమారు 80 బస్సులను మాత్రమే నడుపుతున్నాయి. రైళ్ల విషయానికి వస్తే రోజూ రెండు రైళ్లు మాత్రమే (ప్రత్యేక రైళ్లను తీసివేస్తే) బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉన్నాయి. దీంతో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వచ్చినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ బస్సు సర్వీసులు ఒకటే లేదా గరిష్టంగా మూడు చోట్ల మాత్రమే ప్రయాణికుల పికప్ పాయింట్లను ఏర్పాటు చేసుకొన్నాయి. అయితే ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం కనిష్టంగా పదిచోట్ల కంటే ఎక్కువ పికప్ పాయింట్లు ఉండటం కూడా ప్రయాణికులు ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ప్రభుత్వ రవాణా వ్యవస్థను పెంచితే ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు కళ్లెం పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రాణాలు.. గాల్లో దీపాలు
Published Thu, Jul 28 2016 2:05 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM
Advertisement
Advertisement