అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఆగంతకుల దహనకాండతో భయాందోళనకు గురవుతున్న రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సందర్శించి బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ ఘటనపై తక్షణం సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేగాక నిందితులను వెంటనే పట్టుకుని దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ముందుగా బాధిత రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించింది.
అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి మండల గ్రామాల్లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు సాగించిన దహనకాండకు రైతుల పొలాల్లోని షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలు మొత్తం 13 చోట్ల దహనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ మంగళవారం పర్యటించింది.
తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దం డ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దహనమైన షెడ్లు, అరటితోటలను పరిశీలించి బాధిత రైతులతో నేరుగా మాట్లాడింది. వారికి అండగా నిలుస్తామని తెలిపింది.
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తీర్మానాలు చేసిన గ్రామాల్లోని ఈ సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లుగా అభిప్రాయపడింది.
జరిగిన సంఘటనలపై వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితులపై చర్యలు చేపట్టాల్సిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బాధ్యత మరిచి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించింది.ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ ఉండగా, వారితో విచారణ జరపకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడింది.
పర్యటన సాగిందిలా....
జిల్లా కేంద్రం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సాయంత్రం వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దాండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించింది.
తొలుత కమిటీ లింగాయ పాలెం గ్రామానికి చేరుకుంది. బాధిత రైతు గుంటుపల్లి మధుసూదనరావు పొలం వద్దకు వెళ్లి దహనమైన వెదురు బొంగులు, పైపులైనులు, అరటి తోటను పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘పొలంలో 3,500 వెదురు బొంగులు, 300 అరటి చెట్లు, డ్రిప్ పైపులు, షెడ్డు తగలబెట్టారు. ఎంతలేదన్నా రెండున్నర లక్షల నష్టం జరిగింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఎందుకు చేశారో, ఎవరు చేశారో కూడా అర్థం కావడం లేదు. నాకు నష్టపరిహారం అందకపోయినా ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తే చాలు.’
అదే గ్రామంలో మరో పొలం వద్దకు వెళ్లి కమిటీ పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న కౌలు రైతు చిన్న మీరాసాహెబ్ మాటల్లో ఆవేదన వ్యక్తమైంది. ‘ఎకరం పొలం రూ. 30వేలకు కౌలుకు తీసుకుని పంట వేశా, 150 వెదురు బొంగులు, 100 అరటి చెట్లు, డ్రిప్ పైపులు తగలబడ్డాయి. లక్షన్నర వరకు నష్టపోయినట్టే. ఎవరో రెక్కీ నిర్వహించి మరీ వరుసగా తగలబెట్టినట్టు అర్థమవుతోంది. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’
అక్కడి నుంచి ఉద్దండ్రాయునిపాలెంలో బూడిదగా మారిన పొలాన్ని పరిశీలించిన కమిటీ రైతు జొన్నలగడ్డ వెంకట్రావును పరామర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు. ‘ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి వేశా. నెల కిందట 14 వేల వెదురు బొంగులు, 150 ఎరువు బస్తాలు, జనరేటర్ డ్రిప్ పైపులు తగలబెట్టారు.10 లక్షలకు పైగానే నష్టపోయా. నేను రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించాను. అయితే నాతో గ్రామంలోని వారంతా సోదర భావంతో ఉంటారు. ఎందుకిలా చేశారో తెలియడంలేదు.’
అనంతరం కమిటీ వెంకటపాలెం గ్రామాన్ని సందర్శించింది. పలువురు రైతులను పరామర్శించి మనోధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ, తాము ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో రైతు లంకా రఘునాధబాబు పొలంలో ఓ ఆగంతకుడు నిప్పు అంటిస్తుండగా, వెంబడించడంతో పారిపోయినట్టు స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి రైతులో కనిపిస్తుందన్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పూనూరి గౌతమ్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి హెనీ క్రిస్టినా, వైఎస్సార్ సీపీ మైనార్టీ, ఎస్సీ, సేవాదళ్ విభాగ కన్వీనర్‌లు సయ్యద్ మాబు, బండారు సాయిబాబు ఇంకా నాయకులు కొత్త చిన్నపరెడ్డి, దర్శనపు శ్రీనివాస్, రాచకొండ ముత్యాలరావు, సుద్దపల్లి నాగరాజు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.