బీఆర్‌టీఎస్ కారిడార్ మధ్య రోడ్డులో బస్సు, కారు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆ మార్గంలో బస్సులు తప్ప ఇతర వాహనాలు తిరగకూడదన్న పోలీసుల ఆంక్షలను టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. బస్సు కారిడార్‌లో అటూ ఇటూ చక్కర్లు కొడుతూ దూసుకొచ్చేస్తుంటే ఎదురుగా వస్తున్న బస్ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్‌ని ఆపేశారు. అయినా కారు ఆగకుండా ఢీకొట్టేసింది. దీంతో ముగ్గురు టీడీపీ నాయకులు, బస్‌లో ఉన్న కండక్టర్ గాయాలపాలయ్యారు. ప్రయాణికులు భీతిల్లారు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నం బీఆర్‌టీఎస్ కారిడార్ మధ్య రోడ్డులో సింహాచలం నుంచి ఆర్‌కేబీచ్‌కి 28 హెచ్ బస్ వెళ్తుండగా... సరిగ్గా ఇక్కడి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా కారు అటూ ఇటూ తిరుగుతూ వచ్చింది. ఒక దశగా బస్‌కి ఎదురుగా దూసుకొచ్చేసింది.
దీంతో బస్‌ను డ్రైవరు ఆపేశారు. అయినా కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కారు, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో కండక్టర్ పీవీకేరెడ్డి తలకు గాయాలవ్వగా, కారులో ఉన్న టీడీపీ నాయకులు పుట్టా కార్తీక్, కిరణ్, చిన్న అనే వ్యక్తులు బలంగా గాయపడ్డారు. వీరిని నగరంలోని ఓ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఇదిలా ఉండగా, కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ప్రయాణికులు చర్చించుకున్నారు. మద్యం సేవించి కారు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment