విశాఖలో చికిత్స పొందుతున్న రావాడ రాకేష్
సాక్షి, అనకాపల్లి(విశాఖపట్నం): పదిహేనేళ్ల క్రితం భర్త పోయాడు.. ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్న ఆశతో ఆమె బతుకుతోంది.. తన కళ్ల ముందే వారిని స్తంభానికి కట్టేసి రక్తం కారేలా కొడితే ఆమె తట్టుకోగలదా? వారిని వదిలేయమని వేడుకున్నా.. మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది.
జీవీఎంసీ విలీన గ్రామం కేఎన్‌ఆర్ పేటలో ఈనెల 10వ తేదీ రాత్రి జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసింది. ద్విచక్రవాహనం వేగంగా నడిపారంటూ టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఇద్దరు యువకులను మందలించడంతో ప్రారంభమైన ఘర్షణ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దురుసుగా ప్రవర్తించారంటూ అక్కడి వారంతా ఇద్దరు దళిత యువకులపై మూకుమ్మడిగా దాడి చేసి చివరకు స్తంభాలకు కట్టి కొట్టడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి.
మారేడుపూడికి చెందిన రావాడ రాజ్యలక్ష్మి భర్త 2006లో చనిపోయాడు. ఆమె ఇద్దరి కుమారులు రావాడ రాకేష్, లోకనాథ్ ఐటీఐ, డిప్లమో చదువుతున్నారు. గతంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసిన రాజ్యలక్ష్మి ప్రస్తుతం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 10వ తేదీన కేఎన్‌ఆర్ పేటలో తన కుమారులపై దాడి జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లి ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేని విధంగా దూషించడంతోపాటు.. తనను తోసేశారని రాజ్యలక్ష్మి కన్నీంటిపర్యంతమవుతోంది. తప్పు ఒప్పులుంటే సర్దిచెప్పుకోవాలి తప్ప మరీ స్తంభానికి కట్టి రక్తమొచ్చేలా కొడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ మాతృమూర్తి. సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులను కూడా కొందరు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగి బాధితులను విడిపించి ముందుగా అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి, తర్వాత విశాఖకు తరలించారు.
ప్రస్తుతం రాకేష్ తీవ్ర గాయాలతో విశాఖ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన లోకనాథ్ కాసింత స్వస్థత చేకూరిన తర్వాత 12వ తేదీ సాయంత్రం అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసును నీరుగార్చేందుకు కుయుక్తులు...
ఇటీవల గెలుపొందిన ఒక టీడీపీ కార్పొరేటర్ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ కార్పొరేటర్‌తోపాటు ఒక టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినప్పటికీ పోలీసులు బాధితులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. బాధితులకు న్యాయం జరగాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment