పాలకులు, అధికారులకు ముందుచూపు కొరవవడంతో జిల్లాలో వివిధ పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేసిన రూ.7 కోట్లు వృథా కానున్నాయి. ఆదర్శ పాఠశాలల ఏర్పాటులో భాగంగా పలు ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్నారు. అయితే మూసివేయనున్న పాఠశాలల అభివృద్ధికి రూ.కోట్లు వ్యయం చేశారు. ఆ పాఠశాలలను త్వరలో మూసివేయనుండడంతో ఆ సొమ్మంతా బూడిదిలో పోసిన పన్నీరు చందంగా మారింది.
విజయనగరం అర్బన్: ఆదర్శపాఠశాలల ఏర్పాటులో భాగంగా త్వరలో జిల్లాలో 194 ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్న సంగతి తెలిసిందే. అయితే పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇటీవల సుమారు రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. 194 పాఠశాలల్లో 70 పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు, మిగిలిన పాఠశాలలకు కేవలం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాగునీటి బోరు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొక్క పాఠశాలకు రూ.5 లక్షల చొప్పున ఖర్చుచేశారు. కేవలం మరుగుదొడ్లు, నీళ్ల ట్యాంకుల ఏర్పాటు వరకు రూ.లక్ష చొప్పున ఒక్కొక్క బడికి వెచ్చించారు.
వివిధ స్వచ్ఛంద సంస్థలు నిధులు విరాళంగా అందజేసి, ఈ అభివృద్ధి పనులు చేపట్టాయి. ఈ పనులు ప్రారంభించే సమయానికి ఆదర్శపాఠశాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆదర్శపాఠశాలల వల్ల జిల్లాలో పలు పాఠశాలను విలీనం చేయాల్సి ఉంటుందని అప్పటికే స్పష్టత ఉంది. అయినా దాన్ని పట్టించుకోకుండా వచ్చిన నిధులు ఖర్చుపెట్టారు. ఇప్పుడీ తాగునీటి బోర్లు, మరుగుదొడ్లు వృథా కానున్నాయి.
రూ.కోట్లలో స్థిరాస్తులు: జిల్లాలో మూతపడుతున్న 194 ప్రాథమిక పాఠశాలల్లో స్థిరాస్తులు రూ.కోట్లలోనే ఉంటాయి. ఈ భవనాలను ఏం చేయబోతున్నారన్న విషయమై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో వీటి సంరక్షణపై పాఠశాలను ఖాళీచేసే ఉపాధ్యాయుల నుంచి స్థానికల వరకూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గజపతినగరం, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఒక్కో మండలంలో 5 నుంచి 10 పాఠశాలల వరకూ రద్దుకానున్నాయి. జాతీయ రహదారి కావడం వల్ల అక్కడ స్థలం విలువ రూ.కోట్లలో ఉంటుంది. అదేవిధంగా మిగిలిన మండలాలలో కూడా మండల కేంద్రం, పట్టణాలను ఆనుకుని ఖరీదైన స్థలాలలో ఉన్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. మూతపడిన పాఠశాల భవనాలు, ఖాళీస్థలాలపై స్త్రీశిశుసంక్షేమ శాఖ, పంచాయతీశాఖ, వశుసంవర్థక శాఖ వంటి ప్రభుత్వ ఇతరశాఖలు దృష్టి సారించాయి. గ్రామ స్థాయిలో శాఖాపరమైన సేవలను అందించడానికి అవసరమని సేవల నిర్వహణకు కావాలంటూ కారణాలు చెబుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ మేరకు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామస్థాయిలో రాజకీయనాయకుల దృష్టి కూడా పడింది. ఆయా పాఠశాలలకు ఆనుకుని ఉన్న తమ ఖాళీస్థలాలలో వాటిని కలుపుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
స్పష్టమైన నిర్దేశాలు రాలేదు: డీఈఓ
విలీనం కానున్న పాఠశాల స్థిరాస్తుల సంరక్షణపై స్పష్టమైన నిర్దేశాలు రావాల్సి ఉందని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. ఆదర్శపాఠశాల ఏర్పాటు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై త్వరలో మార్గదర్శకాలు వస్తాయని వాటిని అనుసరించి చర్యలు చేపడతామన్నారు.
మూసేందుకు.. ముస్తాబెందుకో..!
Published Tue, Aug 11 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement