రెండు మనసులను ఒక గూటికి చేర్చే మహత్తర మంత్రం ప్రేమ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు... అన్ని హద్దులు చెరిపేసి కలుసుకునేలా చేసే ఓ అద్భుతశక్తి. ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున పార్కుల్లో సందడి, సినిమాలు, షికార్లు, నవ్వుల పువ్వులు, గ్రీటింగ్ కార్డులతో ప్రేమపక్షుల హుషారే వేరు. కానీ, పరిస్థితులు మారాయి. యువత మదిలో ఇపుడు మోగుతోంది ప్రేమ మంత్రం కాదు. వారి చూపంతా లక్ష్యసాధనవైపే. కెరీర్ తర్వాతే ప్రేమ అంటోంది.
- న్యూస్‌లైన్, కరీంనగర్ బిజినెస్
కరీంనగర్ బిజినెస్, న్యూస్‌లైన్ : గతంతో పోలిస్తే ప్రేమ వివాహాలు చాలా తగ్గాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటలను పరిశీలిస్తే నూటికి 63 శాతం జంటలు ప్రేమ వివాహం చేసుకున్నవారే. మన జిల్లాలో నూటికి 86 శాతం పెద్దలు కుదిర్చిన పెళ్లిలే జరుగుతున్నాయి. యువత ధ్యాసంతా జీవితంలో స్థిరపడాలనే లక్ష్యసాధనపైనే. కెరీర్ తర్వాతే ప్రేమంటున్న యువత 90 శాతంపైనే. మిగతావారు కెరీర్‌తోపాటు ప్రేమ కూడా ముఖ్యమే అంటున్నారు. కొందరు ప్రేమనే నమ్ముకుంటున్నా
రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారే ఎక్కువ. ఇళ్లలో తెలియకుండా పెళ్లి చేసుకునే సవాలే లేదంటున్నారు. ఇంతకుముందు ప్రేమికులు హంగు ఆర్భాటాలు లేకుండా దేవాలయాల్లో, ఆర్యసమాజ్ వంటి సంస్థల్లో పెళ్లి చేసుకున్న యువత ఇప్పుడు సంప్రదాయ వివాహాలకు పెద్దపీట వేస్తోంది. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరి సమక్షంలో సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి జరగాలని కోరుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ, ప్రేమ వివాహాలపై పలువురు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆత్మీయులను దూరం చేస్తుంది
చాలా మంది కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడుతుంటారు. ప్రస్తుతం నేను ఎంటెక్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన కూడా కలగలేదు. నేను పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటాను. ప్రేమ వివాహాలతో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయులు దూరమవుతారని నా గట్టి అభిప్రాయం. నేను ఇంతవరకు గమనించిన ప్రేమ జంటలన్నీ కూడా ఇబ్బందుల పాలవుతున్నాయి.
- ప్రియా, ఎంటెక్
తల్లిదండ్రులే ముఖ్యం
మన జీవితంలో సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తలచుకునేది మన తల్లిదండ్రులనే. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల మాటనే శిరసావహించి వాళ్లు చూసిన సంబంధాన్ని మేము చేసుకున్నాం. ప్రేమ వివాహం అంటే మాకు ఇష్టం లేదు. చాలా మంది యువతీయువకులు సెల్‌ఫోన్‌లతో, ఫేస్‌బుక్, చాటింగ్‌ల కారణంగా అనుకోకుండా దగ్గరైపోతున్నారు. ఆకర్షణనే ప్రేమనుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
- స్వప్న-రాందర్శేందర్‌రెడ్డి దంపతులు
పెద్దల సమక్షంలో జరగాలి
పెళ్లంటే నూరేళ్ల పంట. మానవ జీవితంలో మరువలేని మధురానుభూతి. ఈ శుభకార్యం తప్పకుండా తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే జరగాలని నా అభిప్రాయం. ప్రేమించినా రెండు వైపులా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక వేళ వచ్చినా పెద్దలు వాటిని ముందుండి పరిష్కరిస్తారు.
- ఎస్.రమణ, ఎంటెక్
జీవితం ఆనందమయం
ప్రేమ వివాహాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. పెళ్లికి ముందుగా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఎదుటి వారి అభిరుచులు, ఆలోచనలు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున వారికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రేమించినా... ఇంట్లో పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నవాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు.
- ఎం.సుజిత్, బీటెక్
మన సంస్కృతి కాదు
ప్రేమికుల రోజు నిర్వహించడ ం మన సంస్కృతి కాదు. నేడు ప్రేమ పెళ్లిలు 10 బాగుంటే.. 90 చెడిపోతున్నాయి. పెద్దలు చేసిన పెళ్లిలు బాగుంటున్నాయి. మన ఇతిహాసాలలో, పురాణాలలో ప్రేమ అనేది ఉంది. కృష్ణుడు ప్రేమకు ప్రథముడు. కానీ, వాటిపై ప్రచారాలు లేవు. కేవలం వ్యాపారాలు అధికం చేయడానికి విదేశీ సంస్కృతి యువతకు అంటించడం వినాశనానికి నాందిగా చెప్పవచ్చు.
- డాక్టర్ రమణాచారి, ఆర్‌ఎస్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్
మెప్పించి ఒప్పించాం
మా ప్రేమకు కేంద్రం వేములవాడ. అక్కడ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు 1992లో ప్రేమలో పడ్డాం. మా కులాలు వేరు. ఇద్దరం కలిసి జీవించాలనుకున్నాం... ఇంట్లో వారందరనీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరు పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. కుటుంబావసరాల రీత్యా ఒకరం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. మరొకరం ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నాం. నేడు చాలా మంది స్థిరత్వం లేకుండా... ఆకర్షణనే ప్రేమ అనుకుని ముందుకు సాగుతున్నారు. ఈ విధానం మారాలి.
- బహుద్దూర్ రఘుకిశోర్- శ్రీదేవి (గెజిటెడ్ హెచ్‌ఎం, వడ్కాపూర్)
కెరీర్.. ప్రేమ.. పెళ్లి..
Published Fri, Feb 14 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement