సాక్షి , కరీంనగర్: ప్రేమ.. కులమతాలకు అతీతమైన భావన. టీనేజీ వయసులో మొదలయ్యే ప్రేమకథలు ఆకర్షణతో మొదలై.. అక్కడితో ముగుస్తాయి. కానీ, పరిణితితో కూడిన ప్రేమకథలు కచ్చితంగా విజయతీరాలు చేరతాయి. ఒక చేత్తో కెరీర్, మరో చేత్తో ప్రేమను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఖండాలు దాటినా, ఏళ్లకు ఏళ్లు గడిచినా ఎదురుచూపుల్లోనే బతికేస్తారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఆ తరువాత పెద్దల్ని ఒప్పిస్తారు. కొందరికి ఈ అవకాశం లేకపోవచ్చు. అయినా వీరు చేరుకున్న విజయతీరాలు, సమాజంలో వీరికి దొరికే స్థానం వీరిపై ఉన్న వ్యతిరేక భావనను క్రమంగా దూరం చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై కథనం.
మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్
ఉద్యోగంలో సెటిల్ అయ్యాక మా స్నేహితులతో మా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి్సన అవసరం రాలేదు. అందరినీ ఒప్పించి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య దివ్యాన్షీ కంటి డాక్టర్. ఈ తరం యువతకు నేను చెప్పేది ఒక్కటే.. కెరీర్‌పై దృష్టి పెట్టి లక్ష్యం సాధిస్తే అన్ని మనవద్దకు వచ్చి చేరుతాయి. ఆకర్షణకు గురైతే లైఫ్ ఆగమవుతుంది.
– సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్– డాక్టర్ దివ్యాన్షీ దంపతులు
ఖండాలు దాటిన ప్రేమ
నేను ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నక్రమంలో నాకు రమేశ్ పరిచమయ్యాడు. రోజూ మా కాలేజీకి వచ్చేవాడు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయితే, జీవితంలో పైకి రావాలన్న నా కలను వివరించాను. అయినా తను వెనకడుగు వేయలేదు. నాకు పూర్తిగా సహకరించాడు. ఉన్నత విద్య కోసం నేను బ్రిటన్ వెళ్లాను. పీజీ పూర్తయి ఉద్యోగంలో చేరాక ఇండియా వచ్చాను.
నా కోసం ఎదురుచూస్తున్న రమేశ్‌తో వివాహం జరిగింది. కులాలు వేరుకావడంతో మొదట్లో మా పెద్దలు వ్యతిరేకించినా.. కెరీర్‌లో నిలదొక్కుకున్న తీరుకు మా ప్రేమను అంగీకరించారు. ఇపుడు లండన్‌లో రెండు రెస్టారెంట్లు, ఒక కేక్‌షాప్ నడుపుతున్నాం. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నం. ఏటా మా ఇద్దరి పిల్లలతో ఇండియాకు వస్తాం.
– సుష్మ– రమేశ్
నేనే ప్రపోజ్ చేశా..
ఏదో సందర్భంలో తన ఫ్రెండ్ ప్రశాంత్‌ను పరిచయం చేశారు. ఆ పరిచయమే కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. ధైర్యం చేసి నేనే పెళ్లి ప్రేమను ప్రతిపాదించా. అమ్మానాన్న అంగీకరించలేదు. గొడవలు కూడా అయ్యాయి. సొంతంగా నిర్ణయం తీసుకుని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించి కలిసిపోయారు. ప్రస్తుతం అంతా సంతోషంగానే ఉంది.
– లహరి, ప్రశాంత్
అనాథ యువతికి అన్నీ తానై..
కథలాపూర్(వేములవాడ): అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు ఓ సామాజిక సేవకుడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు శేఖర్ షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని అదే గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించాడు. 2013లో శేఖర్, రమ్య ప్రేమ వివాహం చేసుకున్నారు.
తల్లిదండ్రులు లేని ఆమెకు అన్నీ తానయ్యాడు. వీరికి శ్రీహర్ష, రిషికేశ్ ఇద్దరు కుమారులు. శేఖర్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో 2018లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. కులాంతరమే కాదు.. అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్‌ను పలువురు అభినందించారు.
ప్రేమ కోసం దేశంలోనే..
మాది మంథని, మా వారిది కరీంనగర్. నేను అపుడు పీజీ చదువుతున్నా. మా ఆయన ప్రభాకర్ అప్పటికే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలిశాం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాం. మాకు ఇపుడు ఒక పాప. మా ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు చివరికి మమ్మల్ని క్షమించేశారు. హైదరాబాద్‌లో ఓ ఇంటి వారిమయ్యాం. విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా మా పేరెంట్స్‌ను చూసుకునేందుకు మా ప్రభాకర్ వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. ఏమాత్రం సెలవు దొరికినా మా పేరెంట్స్‌కే టైం కేటాయిస్తాం.
– స్వప్న– ప్రభాకర్
అప్పట్లో చాలా కష్టపడ్డాం
నాది జగిత్యాల, ఆమెది కరీంనగర్. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాకు ఎన్‌సీసీలో పరిచయం. పీజీకి వెళ్లాక కూడా కొనసాగింది. అపుడే ఎస్సై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తనకు దాదాపుగా ఏడాది దూరంగా ఉండి ప్రిపేరయ్యా. ఈ లోపు విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారు. నేను ఎస్సైగా సెలెక్ట్ అయ్యాక మరో ఏడాది దూరంగా ఉన్నాం. పోస్టింగ్ తీసుకున్నాక వెళ్లి వారిని ఒప్పించా. తొలుత వ్యతిరేకించినా... కొన్నిరోజులకు కలిసిపోయాం. ఇపుడు నేను సీఐగా మానుకోటలో విధులు నిర్వహిస్తున్నా. మాకిద్దరు పాపలు. కులాలు వేరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటే అంతా ఆమోదిస్తారు.
– సుష్మ– రవిరాజ్
ప్రేమ ముందు ఓడిన వైకల్యం
పెద్దపల్లిరూరల్: ‘నా స్వాతి బంగారం.. నేను మరుగుజ్జుగా పుట్టినా నాకు ఆ భగవంతుడు స్వాతి రూపంలో మంచి జీవితాన్నే ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు రవికిరణ్. స్వాతి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి పెద్దపల్లికి వలస వచ్చింది. వారు రవికిరణ్ ఇంటి సమీపంలో అద్దెకు రావడంతో స్వాతితో ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది. స్వాతి కుటుంబీకులు వ్యతిరేకించడంతో అప్పటి సీఐ హబీబ్‌ఖాన్‌ను ఆశ్రయించగా ఠాణాలోనే పెళ్లి జరిపించారని రవికిరణ్, స్వాతి పేర్కొన్నారు.
వారికి ఓ బాబు, ఇద్దరు కూతుళ్లు జన్మించినా అనారోగ్య కారణాలతో బాబు, ఓ కూతురు చనిపోయారని బాధపడ్డారు. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశాజ్యోతిని తమకున్నంతలో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరుగుజ్జునైన తనకు ప్రభుత్వం నుంచి దివ్యాంగ పింఛన్ అందుతోందని, మెప్మాలో పనిచేసినందుకు మరో నాలుగు వేలతోనే నెట్టుకొస్తునన్నాడు.
టీనేజ్ ప్రేమతో సమస్యలు
చదువు పూర్తికాకుండానే టీనేజ్‌లో ప్రేమలో పడుతున్న వారు చాలా మంది ఆ తరువాత కాలంలో ప్రేమ, ఆకర్షణ తేడాలు తెలుసుకుని తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా ఇంకొకరు గౌరవించే రీతిలో ప్రేమ ఉండాలి. అంతే కాని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌ల్లో పెడతానని బ్లాక్‌మెయిలింగ్ దిగడం సరికాదు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం.
– రాజశేఖర్‌రాజు, సీఐ, కోరుట్ల
Comments
Please login to add a commentAdd a comment